Abhinandan: గన్ ఇవ్వలేదు... వాచీ, ఉంగరం మాత్రం ఇచ్చేశారు!: అభినందన్

  • ప్యారాచూట్ తో ల్యాండ్ అయిన వేళ అభినందన్ వద్ద పలు వస్తువులు
  • అన్నీ స్వాధీనం చేసుకున్న పాకిస్థాన్ అధికారులు
  • కొన్ని మాత్రమే తిరిగి అప్పగింత

దాదాపు 60 గంటల పాటు పాకిస్థాన్ సైన్యం అధీనంలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్, తిరిగి ఇండియాకు వచ్చిన వేళ, దేశమంతా సంబరాలు జరుపుకుంటుంటే, ఆయన్ను భారత అధికారులు విచారిస్తున్నారు. పాక్ అధికారులు ఏం అడిగారు? అభినందన్ ఏం చెప్పాడు? రహస్యాలు ఏమైనా వెల్లడించాడా? అన్న కోణంలో విచారణ సాగుతోంది. ప్యారాచూట్ సాయంతో అభినందన్ పాకిస్థాన్ భూభాగంపై ల్యాండ్ అయిన వేళ, ఆయన వద్ద ఓ గన్ తో పాటు భారత మ్యాప్ లు, అతను దిగాల్సిన ఎయిర్ బేస్ లు, పరిస్థితి అదుపుతప్పితే ల్యాండ్ కావాల్సిన అత్యవసర రన్ వేలు తదితరాల మ్యాప్ లతో కూడిన పత్రాలున్నాయి. ఆయన చేతికి ఉంగరం, వాచీ, కళ్లజోడు తదితరాలు కూడా ఉన్నాయి.

తాను పాక్ సైన్యానికి పట్టుబడే ముందు అభినందన్, తన వద్ద ఉన్న పత్రాలను నాశనం చేశాడు. తుపాకిని కూడా ఉపయోగించాడు. అభినందన్ పట్టుబడిన తరువాత, అతని వద్ద ఉన్న అన్ని వస్తువులను పాక్ స్వాధీనం చేసుకుంది. వేసుకున్న దుస్తుల నుంచి, ఐడీ కార్డు, గన్, ఉంగరం, వాచీ, కళ్లజోడు తదితరాలన్నీ తీసేసుకుంది. అభినందన్ ను తమ దేశానికి పట్టుబడిన యుద్ధ ఖైదీగా పేర్కొంటూ 27,981 నంబరును ఇచ్చింది. తిరిగి ఇండియాకు అప్పగిస్తున్న వేళ, గన్ ను ఇవ్వకుండా వాచీ, ఉంగరం తదితరాలను ఇస్తూ, వాటిని ఇచ్చినట్టు ఓ దస్త్రాలపై సంతకం చేయించుకుంది.

ఇక ఇదే విషయాన్ని తనను కలిసిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందన్ వివరించారు. తనకు ప్రత్యేక సివిల్ డ్రస్ ను ఇచ్చారని, పాక్ అధికారులు తనను శారీరకంగా హింసించలేదని, మానసికంగా మాత్రం ఇబ్బంది పెట్టారని ఆయన చెప్పారు. పాక్ లో తాను గడిపిన 60 గంటల్లో ఏం జరిగిందన్న విషయాన్ని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. అభినందన్‌ భార్య, విశ్రాంత స్క్వాడ్రన్‌ లీడర్‌ తన్వీ మార్వా, ఆయన కుమారుడు, సోదరి కూడా ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం అభినందన్ కు పలు రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.

More Telugu News