Chandrababu: ఒకే రోజు రూ. 8100 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం: చంద్రబాబు

  • సీమకు 214 టీఎంసీల నీటిని ఇచ్చిన ఘనత టీడీపీదే
  • కేఈ, కోట్ల కుటుంబాలు ఒకే పార్టీలో ఉండటం ఒక చరిత్ర
  • రూ. 6వేల కోట్లతో ఓర్వకల్లులో సోలార్ ప్రాజెక్టు రాబోతోంది

రానున్న రోజుల్లో రాయలసీమను రతనాలసీమను చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీమకు 214 టీఎంసీల నీటిని ఇచ్చిన ఘనత టీడీపీదేనని చెప్పారు. ప్రతి ఎకరాకు నీటిని ఇస్తామని... సీమను హార్టికల్చర్ హబ్ గా మార్చుతామని తెలిపారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. కర్నూలు జిల్లా కోడుమూరు సభలో మాట్లాడుతూ ఆయన ఈమేరకు హామీ ఇచ్చారు.

కర్నూలు రాజకీయ చరిత్ర అంతా కోట్ల, కేఈ కుటుంబాల చుట్టే తిరిగిందని... ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉండటం ఒక చిత్రం అని చంద్రబాబు అన్నారు. ఈ ఒక్క రోజే రూ. 8100 కోట్లతో నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే టీడీపీ ప్రభుత్వం మళ్లీ రావాలని అన్నారు. ఓర్వకల్లులో రూ. 6వేల కోట్లతో సోలార్ ప్రాజెక్టు వస్తోందని తెలిపారు. కర్నూలుకు విమానాశ్రయం తెచ్చామని... ఏప్రిల్ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని చెప్పారు. త్వరలోనే కర్నూలును అమరావతితో కలుపుతూ రహదారి వేస్తామని... నాలుగు గంటల్లో రాజధానికి చేరుకోవచ్చని తెలిపారు.

More Telugu News