YSRCP: కాంగ్రెస్‌, బీజేపీలపై ప్రజలకు నమ్మకం పోయింది: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి

  • ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఇద్దరూ నిలుపుకోలేదు
  • ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది
  • హోదా ఇస్తామంటే రాహుల్‌కైనా మద్దతు ఇస్తా

తెలుగు ప్రజల్ని అడ్డగోలుగా విభజించి, నవ్యాంధ్రకు అన్నీ చేస్తామని ఆశల పల్లకిలో ఊరేగించి చివరికి నట్టేట ముంచారని, అందుకే కేంద్రంలోని అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌లపై ప్రజలకు నమ్మకం పోయిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఇండియాటుడే గ్రూప్‌ నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్‌ 2019’లో ఆయన ఈరోజు ఉదయం మాట్లాడారు. అన్నివనరులు పుష్కలంగా ఉన్న ఏపీకీ ప్రత్యేక హోదా ఎందుకు? అన్న టీవీ ప్రతినిధి ప్రశ్నకు జగన్‌ దీటుగా సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా ప్రజలు అడిగింది కాదని, ప్రజల సంక్షేమాన్ని కోరుతూ మేమే ఇస్తామని కాంగ్రెస్‌, బీజేపీలు ఇచ్చిన హామీ అని గుర్తు చేశారు. ఆ హామీని విస్మరించి కాలయాపన చేస్తుంటే ప్రజలకు పార్లమెంటుపై విశ్వాసం పోతుందన్నారు.

అరవై ఏళ్ల ఉమ్మడి అభివృద్ధికి హైదరాబాద్‌ ఉదాహరణ అన్నారు. ఇప్పుడు ఏపీలో డిగ్రీ తీసుకున్న ఏ ఉద్యోగార్థి అయినా ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తోందన్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు దీటుగా ఏపీ అభివృద్ధి చెందాలంటే అది ప్రత్యేక హోదాతోనే సాధ్యమని చెప్పారు. పన్ను మినహాయింపు, పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని  తెలిపారు. అందువల్ల హోదా ఇచ్చి తీరాల్సిందేనన్నారు.

ఎంతో ప్రాధాన్యం ఉన్న హోదా ఇస్తామంటే కేంద్రంలోని ఏ పార్టీకైనా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 'అక్కడ ప్రధాని అయ్యేది నరేంద్రమోదీయా, రాహుల్‌గాంధీయా అన్నది కాదు, హోదా ఇచ్చే వారికి మద్దతు ఇవ్వాలన్నది మా నిర్ణయం. కేంద్రంలో మీరు (టీవీ ప్రతినిధి) ప్రధాని అయినా హోదా ఇస్తామంటే మీకు మద్దతు ఇస్తాం' అని స్పష్టం చేశారు. అంటే కేంద్రంలో మీపై ఆధారపడే బలహీనమైన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు జగన్‌ నవ్వుతూ సమాధానమిస్తూ, తమకు తమ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు.

More Telugu News