vizag: వాల్తేరు డివిజన్ ని విశాఖ రైల్వేజోన్ పరిధిలోనే కొనసాగించాలి: ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్

  • ఉత్తరాంధ్ర ఉడుం పట్టుకు మోదీ తలవంచారు
  • మా జిల్లాలోని పరిధి మొత్తం ఈ కొత్త జోన్ లో ఉండాలి
  • లేకపోతే ఉత్తరాంధ్ర పోరాటం మళ్లీ చూడాల్సి వస్తుంది

వాల్తేరు డివిజన్ ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో తమ పార్టీ నేతలతో కలిసి ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న డివిజన్ ఇదని, దీని హెడ్ క్వార్టర్స్ విశాఖపట్టణంలో ఉండేవని అన్నారు. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించి విశాఖ రైల్వేజోన్ లో ఈ డివిజన్ ని కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

విశాఖ పర్యటనకు మోదీ రానున్న నేపథ్యంలో రైల్వేజోన్ ప్రకటన వచ్చింది తప్ప, చిత్తశుద్ధితో చేసిన ప్రకటన కాదని విమర్శించారు. ఏపీకి విశాఖ రైల్వేజోన్ ఇచ్చామని చెప్పుకుంటున్న బీజేపీ, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పరిధి మొత్తాన్నిఈ కొత్త జోన్ లో ఉండేలా చూడాలని, లేనిపక్షంలో ఉత్తరాంధ్ర పోరాటం మళ్లీ చూడాల్సి వస్తుందని కేంద్రాన్ని హెచ్చరించారు. విశాఖకు రైల్వేజోన్ కావాలని టీడీపీ పోరాడ లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను రామ్మోహన్ నాయుడు ఖండించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఉడుంపట్టుకు మోదీ తలవంచి రైల్వేజోన్ ఇచ్చారని, ఇది తొలిమెట్టు మాత్రమేనని, మిగిలిన అంశాలను కూడా సాధించుకుని తీరతామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.  

  • Loading...

More Telugu News