Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త.. విశాఖకు రైల్వేజోన్ ను ప్రకటించిన కేంద్రం!

  • రైల్వేజోన్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన
  • ఈ జోన్ కు ‘సౌత్ కోస్ట్ రైల్వే’గా నామకరణం చేశాం
  • కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ఏపీ వాసులకు శుభవార్త. రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్టణం కేంద్రంగా రైల్వేజోన్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఢిల్లీలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి రైల్వేజోన్ ని ప్రకటించామని చెప్పారు.

విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో ఈ జోన్ ఏర్పాటు చేస్తామని, ఈ జోన్ కు ‘సౌత్ కోస్ట్ రైల్వే’గా నామకరణం చేసినట్టు చెప్పారు. రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించిన మిగిలిన కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేస్తామని, భాగస్వాములు అందరితో చర్చించామని, ఈ దిశగా అధికారిక చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రైల్వేజోన్ పై విస్తృతంగా అధ్యయనం చేశామని, వాల్తేర్ డివిజన్ ను రెండు భాగాలుగా విభజిస్తామని, ఒక భాగాన్ని విజయవాడ డివిజన్ లో కలిపి జోన్ లో ఉంచుతామని, మరో భాగాన్ని రాయగడ డివిజన్ గా మారుస్తున్నామని, ఈ డివిజన్ ఈస్ట్ కోస్ట్ జోన్ లో భాగంగా ఉంటుందని స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ లో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు ఉంటాయని గోయల్ పేర్కొన్నారు.

More Telugu News