India: పాకిస్థాన్ కు కీలక సమయంలో హ్యాండిచ్చిన చైనా!

  • దాడులపై తటస్థ పాత్రకే మొగ్గు
  • ఇప్పటివరకు సూటిగా స్పందించని వైనం
  • తమ నుంచి ఏమీ ఆశించవద్దని స్పష్టం చేసే అవకాశం!

పాకిస్థాన్ లోని బాలాకోట్ పై భారత యుద్ధ విమానాలు దాడి చేసిన నేపథ్యంలో ఆసియా అగ్రరాజ్యం చైనా ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుందోనని దౌత్య వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. కానీ, చైనా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇది రెండు దేశాల మధ్య సమస్య అన్నట్టుగా తటస్థ పాత్రకే మొగ్గుచూపింది. అయితే, పాకిస్థాన్ ఇలాంటి సమయంలో చైనా నుంచి భారీస్థాయిలో మద్దతు ఆశించి భంగపడిందని చెప్పాలి. గత కొంతకాలంగా పాక్ కు చైనా అన్ని విధాలుగా సాయం అందిస్తోంది.

చైనా చేసే సాయం డబ్బుతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ తంతు నిరాటంకంగా సాగింది. చైనా నుంచి ఆయుధాలు, ఇతర వ్యవస్థలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మురిసిపోయింది పాక్. ఎంతో అభివృద్ధి చేసిన ఆయుధాలను చైనా తనకు విక్రయించడాన్ని పాక్ గొప్పగా ఫీలైంది. అసలు, తనకు మాత్రమే విక్రయిస్తోందనుకుని పొంగిపోయింది. కానీ ఇప్పుడు భారత్ తో కయ్యం అనేసరికి చైనా అసలు రంగు బయటపెట్టుకుంది. పాక్ ను తన మానాన తనను వదిలేసి తన స్వప్రయోజనాలు చూసుకుంటోంది. పాక్ కు మిలిటరీ సాయం చేయడం అంటే మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపినట్టేనని చైనాకు తెలియంది కాదు. అందుకే, ఈ పరిస్థితుల్లో తమ నుంచి ఎలాంటి మద్దతు కోరుకోవద్దని చెప్పేందుకు చైనా ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది.

అయితే, చైనా ప్రవర్తన వెనుక బలమైన వాణిజ్య ప్రయోజనం దాగివుంది. ప్రపంచంలోని అనేక దేశాలతో సత్వర వాణిజ్యం కోసం భారీస్థాయిలో సింగిల్ కారిడార్ కోసం చైనా గత కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ పేరుతో అనేక దేశాలను కలుపుతూ రహదారులు నిర్మించడం, పోర్టులు అభివృద్ధి చేయడం... తద్వారా తన సరుకులను ఎక్కువ దేశాలకు చేర్చడం చైనా ముఖ్యోద్దేశం. అమెరికా సహా దాదాపు 130 దేశాలు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ కు మద్దతు తెలిపినా భారత్ మాత్రం వ్యతిరేకించింది.

ఎందుకంటే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ లో భాగంగా నిర్మించే ప్రధాన రహదారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచే వెళుతుంది. భారత్ కు ఇది అభ్యంతరకరం కాబట్టి వెంటనే వ్యతిరేకించింది. ఇప్పుడు భారత్ మద్దతు లేనిదే తన మానసపుత్రిక అయిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజక్ట్ పట్టాలెక్కదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ కోసం తాను చేతులు కాల్చుకోవడమే కాకుండా భారత్ కు మరింత ప్రబల విరోధిగా మారడం ఎందుకన్నది చైనా భావన. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న కీలక సమయంలో పాక్ దూరంగా ఉండడం ద్వారా భారత్ కు సానుకూల సంకేతాలు పంపాలని చైనా అధినాయకత్వం భావిస్తోంది.

More Telugu News