Pakistan: అణు బాంబుల దిశగా పాక్ చూపు.. జాతీయ కమాండ్ అథారిటీ భేటీకి ఇమ్రాన్ ఖాన్ పిలుపు!

  • బాలాకోట్ లో ఉగ్రస్థావరాలపై భారత్ దాడి
  • ఎన్సీఏ సమావేశం నిర్వహించాలని ఇమ్రాన్ నిర్ణయం
  • పార్లమెంటు ఉభయ సభల సమావేశానికి పిలుపు

పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రస్థావరంపై భారత్ వైమానిక దాడి నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. అణ్వాయుధ కార్యక్రమాలను పర్యవేక్షించే జాతీయ కమాండ్ అథారిటీ(ఎన్సీఏ) సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభలను సమావేశపర్చాలని నిర్ణయించారు.

మరోవైపు ఈ విషయమై పాక్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఖురేషీ మాట్లాడుతూ.. పుల్వామా దాడి తర్వాత భారత్ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. కశ్మీర్‌లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచ దేశాల దృష్టి మరల్చడానికే భారత్ ఈ చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఆత్మరక్షణలో భాగంగానే పాకిస్థాన్ భారత్ దాడులను తిప్పికొడుతోందన్నారు. బాలాకోట్ లో భారత వైమానిక దళం నిన్న చేసిన దాడిలో 350 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

More Telugu News