India: ఉగ్రవాదులను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహం.. తేరుకునేలోపే మరో దాడికి సిద్ధం?

  • రేపో, మాపో మరో దాడికి సమాయత్తం
  • భారత్ బాంబుల వర్షంతో ఉగ్రమూకలు ఉక్కిరిబిక్కిరి
  • బంతి పాక్ కోర్టులోనే ఉందన్న వైమానిక దళ మాజీ అధికారులు

పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించి సమూలంగా తుడిచిపెట్టేసింది. ఈ దాడిలో 350 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.

భారత్ దాడిపై పాక్ భిన్నవాదనలు వినిపిస్తోంది. భారత్ దాడిచేసిందని ఒకసారి, లేదని ఒకసారి రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోంది. భారత దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ స్పష్టం చేసింది. దాయాది ప్రకటనలు ఎలా ఉన్నా.. దాడితో ఉక్కిరిబిక్కిరి  అవుతున్న పాక్ ఉగ్రవాదులు కోలుకోకుండానే మరోదాడికి భారత్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది.  

1971 యుద్ధం తర్వాత తొలిసారి పాక్ గగనతలంలోకి వెళ్లి మరీ దాడిచేసిన భారత వాయుసేన.. వీటిని మున్ముందు కూడా కొనసాగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా దాడి నుంచి ఉగ్రవాదులు తేరుకుని, జవసత్వాలు కూడదీసుకోకముందే మరో దాడి చేసి చావుదెబ్బ కొట్టాలని పథక రచన చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, ఆ దాడి నేడో, రేపో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మీదట కూడా పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి లక్ష్యాలను నేలమట్టం చేసే అవకాశం ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొనడం ఈ  వాదనకు ఊతమిస్తోంది.

యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పాక్ దక్షిణం వైపు నుంచి చిన్న చిన్న ప్రతిచర్యలకు పాల్పడవచ్చు తప్పితే భారీ దాడి జరిపే అవకాశాలు తక్కువేనని రక్షణ రంగ నిపుణుడు, ఢిల్లీ డిఫెన్స్‌ రివ్యూ చీఫ్‌ ఎడిటర్‌ సౌరవ్‌ ఝా పేర్కొన్నారు. ఈ వైమానిక దాడి ద్వారా పాక్‌ నుంచి ఉగ్రవాద దాడుల్ని సహించబోమని తేల్చి చెప్పామని, ఈ దాడి తర్వాత ఉద్రిక్తతలను మరింత పెంచాలా? లేక, బుద్ధిగా మసలుకోవాలో నిర్ణయించుకోవాల్సింది పాకిస్థానేనని మాజీ అధికారి ధరమ్‌జీత్‌ సింగ్‌ పేర్కొన్నారు.

More Telugu News