indian air force: పాక్ భూభాగంపై వాయుసేన దాడి తర్వాత... వివిధ దేశాల స్పందన ఇదే!

  • 12 దేశాల రాయబారులతో విజయ్ గోఖలే భేటీ
  • భారత్ దాడిపై సానుకూలంగా స్పందించిన అన్ని దేశాలు
  • ఉగ్రసంస్థలపై పాకిస్థాన్ తక్షణమే చర్యలు తీసుకోవాలన్న ఆస్ట్రేలియా

పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్ లో ఉన్న జైషే మొహమ్మద్ ప్రధాన కేంద్రంపై భారత వాయుసేన విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో దాదాపు 350 మంది ముష్కరులు హతమయ్యారు. జైష్ అధినేత మసూద్ అజార్ మేనల్లుడు యూసుఫ్ అజార్ కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడుల నేపథ్యంలో పాక్ పై ప్రతీకారం తీర్చుకున్నామంటూ ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతోంది.

మరోవైపు అమెరికా, రష్యా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇండొనేషియా, టర్కీలతో పాటు మరో ఆరు దేశాలకు ఎయిర్ స్ట్రైక్స్ గురించి భారత్ వివరించింది. ఈ దేశాలకు చెందిన రాయబారులతో విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే భేటీ అయ్యారు. దాడులు చేయడానికి గల కారణాలను వారికి వివరించారు.

అనంతరం ఆస్ట్రేలియా స్పందిస్తూ, తమ గడ్డపై నుంచి పని చేస్తున్న జైష్, లష్కర్ ఏ తాయిబాతో పాటు అన్ని టెర్రరిస్టు గ్రూపులపై తక్షణమే పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించింది.

డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన ఒక అధికార ప్రతినిధి మాట్లాడుతూ, తమ దేశాధినేతకు భారత వాయుసేన దాడులకు సంబంధించి అన్ని వివరాలను అందించామని... బాధ్యతాయుతంగా భారత్ వ్యవహరించిందని, పాక్ సైన్యానికి కానీ, పాక్ ప్రజలకు కానీ చిన్న హాని కూడా కలగకుండా భారత్ వ్యవహరించిందని వారు కితాబిచ్చారని తెలిపారు.

ఉగ్రవాదాన్ని అంతమొందించి, ఉపఖండంలో శాంతిని నెలకొల్పే దిశగా భారత్-పాకిస్థాన్ లు దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని బ్రిటన్ సూచించింది.

More Telugu News