Jaish-e-Mohammad: దెబ్బకు ఠా... జైషే ఉగ్రవాదుల ముఠా!

  • 30 నిమిషాలు, 300 మంది ఉగ్రవాదులు
  • మిగ్ లకన్నా మెరుగైన మిరేజ్ విమానాలతో దాడులు
  • పుల్వామా దాడి తరువాత 10 రోజుల ప్లాన్

ఒకే ఒక దెబ్బ... మొత్తం మీద 30 నిమిషాలు... దాదాపు 300 మంది ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న శిబిరాలే లక్ష్యం. సుమారు టన్ను బరువున్న బాంబులను మోసుకెళుతున్న మూడు యుద్ధ విమానాలు. ఒక్కో విమానానికి రక్షణగా వెన్నంటి కదిలిన మూడేసి విమానాలు. మొత్తం 12 మిరేజ్ 2000 యుద్ధ విమానాలు. ఫ్రాన్స్ లో తయారైన ఈ ఫైటర్ జెట్స్ ఎన్నో ఏళ్లుగా భారత వాయుసేనకు సేవలందిస్తూ, మిగ్ లకన్నా మెరుగైనవని నిరూపించుకున్నాయి.

ఇక కార్గిల్ యుద్ధం తరువాత భారత్ తొలిసారిగా ఫైటర్ జెట్స్ ను వాడిన సందర్భం ఇదే. రెండు వారాల క్రితం పుల్వామా సమీపంలో ఆర్మీ కాన్వాయ్ పై దాడి జరిగిన తరువాత, 24 గంటల వ్యవధిలోనే నరేంద్ర మోదీ ఆర్మీకి ప్రతిదాడి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సమయం, ప్రాంతం మీరే నిర్దేశించుకోవాలని, ప్రతీకారం తీర్చుకు రావాలని సూచించారు. అప్పటి నుంచే భారత వాయుసేన దాడికి ప్రణాళికను రూపొందించింది.

ఆత్మాహుతి దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన పాకిస్థాన్ కాస్తంత ఉదాసీనంగా ఉండే సమయం కోసం 10 రోజులకు పైగా ఎదురుచూసిన భారత సైన్యం, ఉగ్రవాదులు కోలుకోలేని దెబ్బను కొట్టింది. ఒక్క దాడితో జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్లో అత్యధికులను తుదముట్టించింది. భారత సైన్యం జరిగిన రెండో విడత సర్జికల్ స్ట్రయిక్స్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా అభినందనల వర్షం కురుస్తోంది.

More Telugu News