Pakistan: 21 నిమిషాలు మాత్రమే... పాక్ తేరుకునేలోపే తీరని నష్టం!

  • యుద్ధ విమానాల సత్తా చాటిన వాయుసేన
  • రాత్రి 11 గంటల నుంచి బాంబులు నింపే పనిలో పైలట్లు
  • పాక్ స్పందించేలోగానే పని పూర్తి

భారత వాయుసేన యుద్ధ విమానాల సత్తా ఎలాంటిదో మరోసారి పాకిస్థాన్ కు తెలిసివచ్చింది. నరేంద్ర మోదీ సర్కారు ఆదేశాలతో జమ్మూ కశ్మీర్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంపు నుంచి టేకాఫ్ తీసుకున్న 12 మిరేజ్ ఫైర్ ఫైటర్ జెట్ విమానాలు కేవలం 21 నిమిషాల్లో తమ పని పూర్తి చేసుకుని తిరిగి బేస్ క్యాంప్ నకు చేరుకున్నాయి.

యుద్ద విమానాల్లో పట్టినన్ని బాంబులను నింపుకుని ఉండాలని గత రాత్రి 11 గంటల సమయంలోనే పైలట్లకు సమాచారం అందగా, ఆ వెంటనే వారు విమానాల్లో బాంబులను నింపే పనిలో నిమగ్నమయ్యారు. ఆపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో వారికి స్పష్టమైన ఆదేశాలు రాగా, ఆపై నిమిషాల వ్యవధిలోనే యుద్ధ విమానాలు ఎల్ఓసీ దిశగా సాగాయి.

ఒక్కో టార్గెట్ వైపు ఓ విమానం బాంబులతో వెళుతుండగా, దాన్ని కాపాడుతూ మూడేసి విమానాల చొప్పున వెళ్లాయని తెలుస్తోంది. ఒకవేళ పాకిస్థాన్ విమానాల రాకను పసిగట్టి స్పందించేలోగానే ఉగ్రవాద స్థావరాలను సర్వనాశనం చేసేయాలని చెప్పగా, గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో యుద్ధ విమానాలు ప్రయాణించాయి. విషయాన్ని పాక్ రాడార్లు పసిగట్టి, అప్రమత్తమయ్యేలోగానే దాడులను పూర్తి చేసిన ఫైటర్ జెట్స్ తిరిగి భారత భూభాగంలోకి తిరిగి వచ్చేశాయి. దీంతో దాయాది దేశం తేరుకునేలోపే ఉగ్రవాదులకు తీరని నష్టం మిగిలింది. 

More Telugu News