Guntur District: నా నియోజకవర్గంలో ఓట్లు తొలగించాలని వైసీపీ కుట్ర చేస్తోంది: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

  • ఓట్ల చేర్పులు, తొలగింపులకు ప్రత్యేక డ్రైవ్ జరిగింది
  • ఐదు వేల ఓట్లను తీసివేయాలని వైసీపీ కోరింది
  • ఒకే ఐపీ అడ్రస్ నుంచి వేర్వేరు దరఖాస్తులొచ్చాయి 

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గంప గుత్తగా ఓట్లను తొలగించాలని వచ్చిన దరఖాస్తులను పక్కన పెట్టాలని డిప్యూటీ తహశీల్దార్ సుభానిని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కోరారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఓట్ల తొలగింపులో ఎన్నికల సంఘం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు.

ఈ నెల 23, 24 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులను ఏర్పాటు చేసి, ఓట్ల చేర్పులు, తొలగింపులకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారని అన్నారు. నియోజకవర్గంలో ఫలానా ఓట్లు తీసేయాలని కోరుతూ బూత్ లెవెల్ అధికారులకు వైసీపీ నాయకులు ఒక్క దరఖాస్తు కూడా చేయలేదని అన్నారు. కానీ, సుమారు ఐదు వేల ఓట్లను తొలగించాలని ఆయా ఓటర్ల ప్రమేయం లేకుండా ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఆన్ లైన్ లో వైసీపీ నాయకులు దరఖాస్తు చేశారని ఆరోపించారు.

ఒకే ఐపీ అడ్రస్ నుంచి వేర్వేరు పేర్లతో వచ్చిన ఈ తప్పుడు దరఖాస్తులను తొలగించాలని డిప్యూటీ తహశీల్దార్ కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తమ ఓట్లు తొలగించాలని ఎవరి పేరు మీద అయితే దరఖాస్తులు వచ్చాయో వారిని ఈ విషయమై విచారించగా, అసలు, తాము దరఖాస్తు చేయలేదని చెప్పారని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఓట్లు తొలగించాలన్న కుట్రలు చేస్తున్నారని వైసీపీ నాయకులపై ధూళిపాళ్ల మండిపడ్డారు. 

More Telugu News