Vijayawada: జలీల్ ఖాన్ కు తప్పు చేశానన్న ఫీలింగే లేదు: మల్లికా బేగం ఫైర్

  • మతాన్ని తన ఇష్టమొచ్చినట్టు వాడుకుంటారా?
  • గతంలో జలీల్ ఖాన్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు
  • అప్పుడు, ఆయన భార్యాపిల్లలు బురఖాలు లేకుండా ప్రచారం చేయలేదా?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయాలని చూస్తున్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్  కూతురు షబానాకు ఫత్వా జారీ అయిన విషయం తెలిసిందే. ఇస్లాం మత నిబంధనల ప్రకారం బురఖా లేకుండా మహిళలు రాజకీయాల్లో రాకూడదని ఆ ఫత్వాలో ఆదేశించారు. దీని వెనుక మాజీ మేయర్ మల్లికా బేగం హస్తం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. 2009లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు. అప్పుడు, జోరుగా తమ ప్రచారం సాగుతున్న సమయంలో జలీల్ ఖాన్ తనపై ఫత్వా జారీ చేయించారని ఆరోపించారు.

ముస్లిం మహిళలు బురఖా లేకుండా బయటకు రాకూడదు కనుక తనకు ఫత్వా జారీ చేయాలని మతపెద్దలతో జలీల్ ఖాన్ చెప్పారని ఆరోపించారు. తన రాజకీయ జీవితం దెబ్బతినడానికి జలీల్ ఖాన్ కారణమని మండిపడ్డారు. ఆరోజు ఎవరైతే తనపై ఫత్వా జారీ చేయడానికి కారణమయ్యారో, ఆయనే ఈరోజు తన కూతురుకి టికెట్ ఇవ్వమని చంద్రబాబుని అడగడం సమంజసమా? అని ప్రశ్నించారు.

మతాన్ని తన ఇష్టమొచ్చినట్టు జలీల్ ఖాన్ వాడుకుంటారా? తప్పు చేశానన్న ఫీలింగే ఆయనకు లేదని విమర్శించారు. గతంలో జలీల్ ఖాన్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ఆయన భార్య, పిల్లలు బురఖాలు లేకుండా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయలేదా? అప్పుడు, ముస్లిం మహిళలు బురఖాలు ధరించకుండా బయటకు వెళ్లకూడదన్న నిబంధన ఆయనకు తెలియదా? అని ఓ రేంజ్ లో ఆమె దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News