CIC: సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఈవీఎంలు!

  • తేల్చిచెప్పిన కేంద్ర సమాచార కమిషన్‌  
  • దరఖాస్తుకు స్పందించాల్సిందేనని ఎన్నికల సంఘానికి ఆదేశం
  • ఇవ్వాలా? వద్దా? అని తేల్చుకునే అధికారం ఈసీదే

ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకపాత్ర పోషించే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌పై మీకున్న అభ్యంతరాలు, తెలుసుకోవాలన్న ఆసక్తి, అనుమానాలు ఉంటే ఈవీఎంని అందించాలని సమాచార హక్కు చట్టం ప్రకారం ఎన్నికల సంఘాన్ని కోరవచ్చు. ఈ మేరకు కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ఆదేశాలు జారీ చేసింది. పది రూపాయలు చెల్లించి సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

అయితే చట్టంలో పేర్కొన్న మినహాయింపులను అనుసరించి దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయించుకునే హక్కు ఎన్నికల సంఘానిదేనని తెలిపింది. ఈవీఎంల సమాచారం కోరుతూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ దరఖాస్తు అందింది. ఇది సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని ఎన్నికల సంఘం ఆ దరఖాస్తుని తిరస్కరించింది. దీంతో సదరు దరఖాస్తుదారుడు కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించాడు.

రికార్డులు, నివేదికలు, ప్రకటనలు, ఈ-మెయిళ్లు, ఎలక్ట్రానిక్‌ రూపంలోని డేటా, మోడళ్లవంటివన్నీ సమాచారమేనని చట్టంలో స్పష్టంగా ఉందని తన ఫిర్యాదులో సీఐసీకి తెలియజేశాడు. ఇతని ఫిర్యాదును పరిశీలించిన సీఐసీ అతని వాదనతో ఏకీభవిస్తూ ఈవీఎంలు కూడా ‘సమాచార’ నిర్వచనం పరిధిలోకి వస్తాయని, అందువల్ల అటువంటి దరఖాస్తుకు ఎన్నికల సంఘం స్పందించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో దరఖాస్తు తిరస్కరించినందుకు ఈసీ క్షమాపణలు కోరింది.

  • Loading...

More Telugu News