Arunachal Pradesh: అరుణాచల్‌ప్రదేశ్‌లో పరిస్థితి ఉద్రిక్తం.. ఉప ముఖ్యమంత్రి బంగ్లాను తగులబెట్టిన ఆందోళనకారులు!

  • కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి
  • 50 కార్లకు నిప్పు
  • 100కు పైగా వాహనాల ధ్వంసం
  • కమిషనర్ నివాసం ధ్వంసం
  • తీవ్రంగా గాయపడిన ఎస్పీ ర్యాంకు అధికారి

దశాబ్దాలుగా నివసిస్తున్న స్థానికేతర కుటుంబాలకు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి సిఫారసు చేసింది. దీంతో శుక్రవారం నుంచి అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటనతో పరిస్థితులు మరింత అదుపు తప్పాయి. దాదాపు 50 కార్లకు నిప్పంటించడంతోపాటు 100కు పైగా వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

ఈ క్రమంలో నేడు అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ బంగ్లాను ఆందోళనకారులు తగులబెట్టారు. దీంతో చౌనా మెయిన్ తన మకాంను నామ్‌సాయ్ జిల్లాకు మార్చారు. నామ్ సాయ్ జిల్లా కమిషనర్ నివాసాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎస్పీ ర్యాంకు అధికారి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ఇటానగర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, కర్ఫ్యూ విధించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ముఖ్యమంత్రి ఫెమా ఖండూతో మాట్లాడి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలు సంయమనంతో ఉండాలని రాజ్‌నాథ్ కోరారు.

  • Loading...

More Telugu News