railway: కనెక్టింగ్‌ ట్రైన్‌ ప్రయాణికులకు శుభవార్త... రైలు మిస్సయితే టికెట్‌ డబ్బు వాపసు

  • ఎటువంటి రద్దు చార్జీలు లేకుండా పూర్తి మొత్తం జమ
  • మొదటి రైలు ఆస్యంగా వచ్చే సమయంలో వర్తింపు
  • ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి

సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. ముందు రైలు ఆలస్యం కారణంగా కనెక్టింగ్‌ రైలు అందుకోలేకపోతే ఆ రైలు చార్జీలను పూర్తి మొత్తం వాపసు చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి అమృత్‌సర్‌కు వెళ్లాలంటే నేరుగా రైలు లేదు. తొలుత ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచి మరో రైలులో అమృత్‌సర్‌ చేరుకోవాలి. ఇటువంటి సమయంలో ప్రయాణికులు రెండు రైళ్ల ప్రయాణానికి సంబంధించి కనెక్టింగ్‌ టికెట్‌ తీసుకుంటూ ఉంటారు.

ఎందుకంటే అక్కడ దిగాక రిజర్వేషన్‌ చేయించుకోవడం కష్టం. దొరికే అవకాశం తక్కువ కాబట్టి. అయితే ఢిల్లీ వెళ్లాల్సిన రైలు ఆలస్యంగా చేరుకుని, అప్పటికే అమృత్‌సర్‌ రైలు వెళ్లిపోతే ప్రయాణికుల పరిస్థితి ఏమిటి? అటువంటి వారి కోసమే ఈ సదుపాయం అని రైల్వేశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ ఒకటి నుంచి అందుబాటులోకి రానున్న ఈ సదుపాయం ఆన్‌లైన్‌ టికెట్లతోపాటు పాసింజర్‌ రిజర్వేషన్‌ కౌంటర్లలో తీసుకున్న టికెట్లకు వర్తింపజేయనున్నారు. టెలిస్కోపిక్‌ లాభం, ఎటువంటి రద్దు చార్జీలు లేకుండా పూర్తి మొత్తం రిఫండ్‌ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ సిహెచ్‌.రాకేష్‌ తెలిపారు.

More Telugu News