Andhra Pradesh: జలీల్ ఖాన్ కుమార్తె పోటీ చేయడాన్ని ఒప్పుకోను.. ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీచేయండి!: మాజీ మేయర్ మల్లికాబేగం

  • 2009లో జలీల్ ఖాన్ నన్ను అడ్డుకున్నారు
  • ముస్లింలు ఓటేయకూడదని ఫత్వా జారీచేయించారు
  • మౌలానా ఇంటి ముందు బైఠాయించిన టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా టీడీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తమకు కేటాయించారని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్ కొన్ని రోజుల క్రితం మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ కుటుంబానికి వ్యతిరేకంగా టీడీపీ నేత, విజయవాడ మాజీ మేయర్ మల్లికా బేగం ఆందోళనకు దిగారు.

తాను 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధం కాగా, తనకు ఓటేయరాదని జలీల్ ఖాన్ మతపెద్దల చేత ఫత్వా జారీ చేయించారని మల్లికాబేగం మండిపడ్డారు. ఇప్పుడు జలీల్ ఖాన్ కుమార్తె విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు సిద్ధం అవుతోందనీ, కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీచేయాలని డిమాండ్ చేశారు. గతంలో జలీల్ ఖాన్ కు అనుకూలంగా ఫత్వా జారీచేసిన మౌలనా ఇంటికి మల్లికాబేగం వెళ్లగా ఆయన ఇంట్లో లేరు.

దీంతో మౌలానా ఇంటి ముందు ఆమె బైఠాయించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదనీ, తనకు న్యాయం జరిగేవరకూ పోరాడుతానని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం  టికెట్ కోసం టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ మీరా తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

More Telugu News