Jayaprakash Narayan: 2019 ఎన్నికల్లో రాజకీయంగా ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి: జయప్రకాశ్ నారాయణ

  • రూ.50 కోట్ల పథకాన్ని ప్రవేశపెట్టి.. గొప్పగా చెప్పుకోవడం దారుణం
  • బడ్జెట్ లో 15 శాతాన్ని ప్రజలకు కేటాయించాలి
  • డబ్బు ఇవ్వని వారిని ప్రజలు ఓడించే పరిస్థితి నెలకొంది

2019 ఎన్నికల్లో రాజకీయంగా పలు మార్పులు సంభవించబోతున్నాయని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. మన ఆత్మగౌరవం కోసం తయారుచేసుకున్న రాజ్యాంగాన్ని ఆత్మన్యూనతతో నాశనం చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాల్లో దీనిపై చర్చ జరగాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఖర్చు ఒక గంటకు దాదాపుగా రూ. 500 కోట్లు ఉంటుందని... కానీ, రూ. 50 కోట్లతో ఒక పథకాన్ని పెట్టి, దాన్ని గొప్పగా చెప్పుకోవడం దారుణమని అన్నారు. ఢిల్లీ పెద్దలు ఈ ప్రకటన చేసే సమయంలోపే రూ. 50 కోట్లు ఖర్చవుతుందని అన్నారు. ఇది చాలా దారుణమైన అంశమని చెప్పారు.

బడ్జెట్ లో ప్రజల కోసం 15 శాతాన్ని కేటాయించాలని... అది ప్రజలకు అందేలా చేయాలని జేపీ సూచించారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వల్ల తమకు డబ్బు వచ్చిందనే భావన ప్రజల్లో ఉంటుందని... అవినీతికి చోటు ఉండదని చెప్పారు. ఇలా చేయకుండా ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బును పంచుతున్నారని... తెలంగాణ ఎన్నికల్లో దీన్ని మనం చూశామని, ఇప్పుడు ఏపీలో కూడా ఇదే జరగబోతోందని... పోటాపోటీగా హామీలను ఇస్తున్నారని మండిపడ్డారు. డబ్బు ఇవ్వని వారిని ప్రజలు ఓడించే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని... ఈ పరిస్థితిలో మార్పు రావాలని, దీనిపై చర్చ జరగాలని అన్నారు. ఈ మార్పుకు లోక్ సత్తా నాందిపలుకుతుందని తెలిపారు. ఓట్ల కోసం సమాజాన్ని బలిపెట్టడం కాదని... భవిష్యత్తు కోసం ఓట్లను సైతం పక్కన పెడదామన్నది లోక్ సత్తా ఆలోచన అని అన్నారు.

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో జరిగిందేదో జరిగిపోయిందని... ఇప్పటికైనా భవిష్యత్తును మార్చుకోవాల్సిన అవసరం ఉందని జేపీ చెప్పారు. మన బిడ్డలు గర్వించేలా మనం వ్యవస్థను మార్చాలని... అది జరగాలంటే, ప్రపంచ అత్యుత్తమ దేశాల్లో కనీసం 15 స్థానాల్లోకి భారత్ ఎదిగేలా కృషి చేయాలని అన్నారు. మన దేశంలో అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు.

More Telugu News