Andhra Pradesh: అమరావతి పేరుతో అవినీతి కట్టడాలు నిర్మిస్తున్నారు.. చంద్రబాబు ‘స్టిక్కర్ బాబు’గా మారిపోయారు!: జీవీఎల్

  • రాజకీయ కుట్రలో భాగంగానే ఎన్డీయేతో తెగదెంపులు
  • కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి
  • ‘ఎన్టీఆర్’ సినిమాలో అన్నీ అబద్ధాలే చూపారు

రాజకీయ కుట్రలో భాగంగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకున్నారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ప్రత్యేకహోదా వద్దని చెప్పిన చంద్రబాబు గత 10 నెలలుగా మాటలు మార్చారని దుయ్యబట్టారు. టీడీపీ ఏపీలో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. వచ్చేనెలలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేయబోతోందని తెలుసుకున్న చంద్రబాబు ‘అన్నదాత సుఖీభావ’ పేరుతో స్టిక్కర్ పథకాన్ని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలను తన పథకాలుగా ప్రచారం చేసుకుంటూ ఏపీ సీఎం స్టిక్కర్ బాబుగా మారిపోయారని ఎద్దేవా చేశారు.

విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం ఇచ్చిన  నిధులు ఏమయ్యాయో చెప్పాలని ఏపీ ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. అన్నీ తామే చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనీ, ఆయనకు అది అలవాటేనని వ్యాఖ్యానించారు. అమరావతి పేరుతో రాష్ట్రంలో అవినీతి కట్టడాలు నిర్మిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ కథా నాయకుడు, మహానాయకుడు సినిమాల్లో అన్నీ అవాస్తవాలే చూపారనీ, అందుకే అబద్ధాలతో తీసిన ఆ సినిమాలను ప్రజలు తిరస్కరించారని తెలిపారు.

టీడీపీ వ్యవహారశైలి నచ్చకే నేతలు ఆ పార్టీని వీడుతున్నారని వ్యాఖ్యానించారు. కుమార్తెను చూసేందుకు జగన్ లండన్ కు వెళితే.. ఎన్నికల కోసం డబ్బులు సమకూర్చుకోవడానికి వెళ్లారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని జీవీఎల్ అన్నారు. అంటే టీడీపీ నేతలు విదేశీ పర్యటనలు చేసేది డబ్బులు సమకూర్చుకునేందుకేనా? అని ప్రశ్నించారు.

More Telugu News