పురోహితులు పేదరికంలో మగ్గిపోవడం నన్ను కలచివేసింది.. అందుకే అర్చకుల వేతనాలను పెంచాం!: సీఎం చంద్రబాబు

22-02-2019 Fri 14:32
  • రూ.5 వేల నుంచి వేతనాన్ని రూ.8 వేలకు పెంచాం
  • దాతల సాయంతో కమిషనర్ ద్వారా ఆలయాల పాలన
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి

పవిత్రమైన అర్చక వృత్తిని నిర్వహిస్తూ పురోహితులు పేదరికంలో మగ్గిపోవడం తనను కలచివేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అందుకే వారి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇప్పటివరకూ నెలకు రూ.5 వేల వేతనం పొందుతున్న అర్చకుల జీతాన్ని రూ.8,000 వేలకు పెంచామని సీఎం వెల్లడించారు. ఇక రూ.10 వేలు పొందుతున్న అర్చకుల వేతనాన్ని రూ.12,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు.

రూ.2 లక్షల వార్షికాదాయం ఉండే దేవాలయాల బాధ్యతను ఆయా గ్రామాలలో ధార్మిక భావాలున్న దాతను ఎంపిక చేసి, అర్చకులతో ఒక కమిటీ వేసి కమిషనర్ ద్వారా పరిపాలన చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. అర్చకుల కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. అర్చకుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాగా, వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అర్చకులు ఏపీ ముఖ్యమంత్రిని కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.