limca book of records: ‘ప్యారడైజ్ బిర్యానీ’కి దక్కిన గౌరవం.. ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు’లో స్థానం

  • ఒక్క ఏడాదిలో దాదాపు 70 లక్షల మందికి పైగా విక్రయం
  • ‘ప్యారడైజ్’ చైర్మన్ కి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
  • ‘ప్యారడైజ్’ కు దక్కిన గౌరవంపై సిబ్బంది హర్షం

ఎన్ని బిర్యానీలు తిన్నా..  హైదరాబాద్ ‘ప్యారడైజ్ బిర్యానీ’కి ఉన్న ‘క్రేజ్’ వేరు. నోరూరించే ఆ బిర్యానీ రుచి చూడని భోజన ప్రియులు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. ఇంతటి పేరు సంపాదించుకున్న ‘ప్యారడైజ్ బిర్యానీ’కి మరో అరుదైన రికార్డు దక్కింది. ఒక ఏడాదిలో అత్యధిక వినియోగదారులకు బిర్యానీ సేవలు అందించినందుకు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు’లో చోటు లభించింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 70 లక్షల మందికి పైగా ఈ బిర్యానీని విక్రయించింది. అంతేకాకుండా, ‘ప్యారడైజ్’ చైర్మన్ అలీ హేమతికి ఆసియా ఫుడ్ కాంగ్రెస్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ‘ప్యారడైజ్ సిబ్బంది’ కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ‘ప్యారడైజ్’ చైర్మన్ అలీ హేమతి మాట్లాడుతూ, తమ సంస్థకు ఈ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. బిర్యానీలో నాణ్యత, వినియోగదారుల నమ్మకంతో పాటు తమ సిబ్బంది కృషి వల్లనే తమకు ఈ గౌరవం దక్కిందని అన్నారు.

‘ప్యారడైజ్’ సీఈఓ గౌతమ్ గుప్తా మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా తమ సంస్థ బ్రాంచ్ లు 37 ఉన్నాయని, త్వరలోనే ఇతర దేశాల్లోనూ తమ బ్రాంచ్ లు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News