Pulawama terror Attack: వరుస ట్వీట్లతో ఇమ్రాన్‌ను ఏకి పారేసిన రాంగోపాల్ వర్మ

  • మీది అసలు దేశమేనా?
  • చర్చలతో సమస్యలు పరిష్కారమైతే మీరు మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నట్టో
  • మా మొద్దు భారతీయులకు కొంచెం తెలివి తేటలు నేర్పాలంటూ ఎద్దేవా

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు. వరుస ట్వీట్లతో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఏకి పారేశాడు. ప్రియమైన ప్రధాని అంటూనే ట్వీట్లతో సర్జికల్ స్ట్రైక్ చేశాడు.

సమస్యలు చర్చల ద్వారా పరిష్కారమైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చేది కాదన్న వర్మ.. ఒక వ్యక్తి వందలకొద్దీ పేలుడు పదార్థాలతో భారత్‌ వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతడితో చర్చలు ఎలా జరపాలో మా మొద్దు భారతీయులకు నేర్పాలంటూ సూచించాడు. అదేమీ ఊరికే చేయాల్సిన పనిలేదని, అందుకు భారతీయులందరం కలిసి ట్యూషన్ ఫీజు కూడా చెల్లిస్తామని పేర్కొన్నాడు.
 
ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తి పాక్‌లో ఉన్న సంగతి మీకు తెలియకున్నా అమెరికాకు తెలుస్తుందన్న వర్మ.. మీది అసలు దేశమేనా? అని ప్రశ్నించాడు.  ఓ మొద్దు భారతీయుడు అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని, తమకు కొంచెం తెలివితేటలు నేర్పాలని కోరాడు. జైషే మహ్మద్, లష్కరే తాయిబా, తాలిబన్, అల్‌ ఖాయిదా వంటి ఉగ్ర సంస్థలు మీ ప్లే స్టేషన్లు అని తనకు ఎవరూ చెప్పలేదని అన్నాడు. అయితే, ఆ సంస్థలపై మీకు ప్రేమ లేదన్న విషయాన్ని మీరెప్పుడూ చెప్పలేదని పేర్కొన్నాడు.
 
 జైషే మహ్మద్, లష్కరే తాయిబా, తాలిబన్, అల్ ఖాయిదా వంటి సంస్థలను బంతులుగా భావించి పాకిస్థాన్ బౌండరీలను దాటిస్తూ భారత పెవిలియన్‌లోకి పంపుతున్నారని వర్మ ఆరోపించాడు. వాటిని మీరు బంతులనుకుంటున్నారా? లేక, బాంబులనుకుంటున్నారో చెప్పాలంటూ వరుసపెట్టి ట్వీట్లతో ఇమ్రాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌కి దిగాడు.

More Telugu News