West Godavari District: గతంలో నేను చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షం వక్రీకరించింది: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని

  • దళితులపై చింతమనేని ఇబ్బందికర వ్యాఖ్యలు 
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన సంబంధిత వీడియో
  • ప్రతిపక్ష నేతల తీరుపై చింతమనేని నిరసన

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గతంలో చేసిన వ్యాఖ్యలపై  ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గత నెల మొదటి వారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన ‘జన్మభూమి’ కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని, దళితుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. ‘మీరు దళితలు, మీకెందుకురా రాజకీయాలు..’ అంటూ దళితులపై చింతమనేని ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారని వైసీపీ, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చేరడంతో వైరల్ గా మారింది.

ఈ వ్యవహారంపై చింతమనేని తన నిరసన వ్యక్తం చేశారు. ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం, ఏలూరులో జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ కు ఓ వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ, దెందులూరులో తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రతిపక్షం తనపై దుష్ప్రచారం చేస్తోందని  మండిపడ్డారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అన్నారు. దళితులు బాధపడేలా తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్టు చెప్పారు.

దళితులు, బీసీలు తన బలమని, రాజకీయంగా ఎవరైతే అణచి వేయబడ్డారో వాళ్లందరిని పైకీ తీసుకు రావడం కోసం అహర్నిశలు శ్రమించే తనపై కుట్ర రాజకీయాలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో, పేపర్లలో తనపై దుష్ప్రచారం చేయడం తగదని, దమ్ముంటే, తాను ప్రసంగించిన మొత్తం వీడియోను చూడాలని, అలా చూడకుండా తనపై ఆరోపణలు చేయడం కరెక్టు కాదని అన్నారు. 

More Telugu News