Andhra Pradesh: సీఎం చంద్రబాబును సన్మానించిన ప్రభుత్వ ఉద్యోగులు

  • ప్రజలతో పాటు ఉద్యోగులకు న్యాయం చేస్తున్నా
  • ప్రభుత్వ ఉద్యోగులు అడిగిన దాని కంటే ఎక్కువే ఇచ్చా
  • ప్రతి ఉద్యోగికి సొంతింటి కల నెరవేరేలా చేశా
ఏపీ ఉద్యోగుల సంక్షేమానికి గాను ప్రభుత్వం చేసిన కృషిపై సెక్రటేరియట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబును సన్మానించారు. ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబును సత్కరించి, గజమాల వేసి అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజలతో పాటు ఉద్యోగులకు న్యాయం చేస్తున్నానని అన్నారు.

 ప్రభుత్వ ఉద్యోగులు అడిగిన దాని కంటే ఎక్కువే ఇచ్చానని, వారు అడిగిన వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చానని, ప్రతి ఉద్యోగికి సొంతింటి కల నెరవేరేలా చేశామని అన్నారు. అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ మరెక్కడా లేదని అన్నారు.అరవై ఏళ్ల శ్రమను హైదరాబాద్ లోనే వదిలేసి వచ్చామని, రాష్ట్ర విభజన తర్వాత అండగా ఉంటామన్న కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు.

ఉద్యోగుల ప్రతి సమస్యను సానుకూలంగా పరిష్కరించానని అన్నారు. మళ్లీ తిరుగులేని శక్తిగా ఏపీ ఎదగాలని ఆకాంక్షించారు. 10.5 శాతం అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఈ నాలుగేళ్లలో ఏపీకి 670 అవార్డులు వచ్చాయని అన్నారు. ఏపీలో తక్కువ పట్టణీకరణ వల్ల ఆదాయం తక్కువగా వస్తోందని, ఈ నాలుగేళ్లలో లోటు వర్ష పాతం, తుపానులు కొంత అవరోధంగా మారాయని అన్నారు. మహిళలకు పసుపు-కుంకుమ నిధులు రెండు విడతల్లో ఇచ్చానని చెప్పారు.
Andhra Pradesh
cm
Chandrababu
amaravathi

More Telugu News