anilambani: డబ్బు చెల్లించండి...లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది: అనిల్‌ అంబానీకి సుప్రీం

  • కోర్టు ధిక్కరణ కేసులో సీరియస్‌
  • నెలలోపు డిపాజిట్‌ చేయకుంటే శిక్ష తప్పదని హెచ్చరిక
  • ఉల్లంఘనకు రూ.3 కోట్ల అపరాధ రుసుం విధింపు

‘ఎరిక్సన్‌ కంపెనీకి చెల్లించాల్సిన రూ.453 కోట్లు నాలుగు వారాల్లోగా చెల్లించాలి. లేదంటే మూడు నెలల జైలు శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ అడాగ్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీని సుప్రీం కోర్టు సీరియస్‌గా హెచ్చరించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ఎరిక్సన్‌ వేసిన ధిక్కరణ పిటిషన్‌ ను విచారించిన జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ వినీత్‌సహరన్‌తో కూడి ధర్మాసనం అనిల్‌ అంబానీ కంపెనీ తీరును తప్పుపట్టింది. కేవలం సారీతో సరిపెట్టడం కాదని, డబ్బు చెల్లించడంతోపాటు కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు అనిల్‌తోపాటు రిలయన్స్‌ టెలికాం చైర్మన్‌ సతీష్‌సేథ్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ చైర్‌పర్సన్‌ ఛాయావిరానీలు తలా రూ.కోటి జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

అంతకు ముందు ఎరిక్సన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదిస్తూ ‘వారి వద్ద రాఫెల్‌, ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు డబ్బులు ఉంటాయి. కానీ మాకు చెల్లించడానికి మాత్రం ఉండవు. న్యాయస్థానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి’ అని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తులు అనిల్‌ అంబానీకి నెల రోజులు  గడువు విధించారు. గడువులోగా కచ్చితంగా డబ్బు డిపాజిట్‌ చేయాల్సిందేనని, లేదంటే శిక్ష తప్పదని హెచ్చరించారు.  అనిల్‌ అంబానీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

  • Loading...

More Telugu News