Telangana: ఓ పసుపు కండువా మంత్రిని చేసింది.. నిరంజన్ రెడ్డి విషయంలో నిజమైన సెంటిమెంటు!

  • వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన నిరంజన్ రెడ్డి
  • పసుపు కండువాతో నామినేషన్ దాఖలు
  • పండితుడు చెప్పినట్లే మంత్రిపదవి కైవసం 

మనలో చాలామందికి రకరకాల నమ్మకాలు ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే పండితులను సంప్రదించాకే ముఖ్యమైన పనులను చేపడుతుంటారు. అలాగే తెలుగురంగు కార్లకే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా మాఘ పౌర్ణమి రోజునే కేసీఆర్ తన మంత్రివర్గ విస్తరణను సైతం చేపట్టారు. ఇదే తరహాలో జోతిష్యాన్ని నమ్ముకున్న ఓ నేత ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. తాజాగా కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఆయనే వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

టీఆర్ఎస్ తొలి ప్రభుత్వ హయాంలో నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా పనిచేశారు. కేసీఆర్ సన్నిహితుల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా నిరంజన్ రెడ్డి గులాబీ రంగు కండువాకు బదులుగా పసుపు రంగు కండువాతో వచ్చారు. దీనిపై అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

అయితే శుభానికి చిహ్నమైన పసుపు రంగు కండువా వేసుకుంటే ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు మంత్రిపదవి సైతం వరిస్తుందని ఓ పండితుడు ఆయనకు చెప్పారట. దీంతో పసుపురంగు కండువాతోనే నిరంజన్ రెడ్డి నామినేషన్ వేశారు. అనుకున్నట్లుగానే సెంటిమెంట్ కలిసొచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిపదవిని సైతం దక్కించుకున్నారు. దీంతో అదృష్టమంటే తమ నేతదేనని నిరంజన్ రెడ్డి అనుచరులు తెగ సంతోషపడిపోతున్నారు.

More Telugu News