imran khan: యుద్ధమే ప్రారంభమైతే ఏం జరుగుతుందో దేవుడికి మాత్రమే తెలుసు: పుల్వామా ఘటనపై ఇమ్రాన్ ఖాన్ స్పందన

  • ఉగ్రదాడులు చేయాల్సిన అవసరం మాకు లేదు
  • ఆధారాలు ఉంటే ఇవ్వండి.. చర్యలు తీసుకుంటాం
  • యుద్ధమే వస్తే.. ఎదుర్కొంటాం

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి వెనుక తమ హస్తం లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇలాంటి దాడుల వల్ల పాకిస్థాన్ కు వచ్చే లాభం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడిప్పుడే పాకిస్థాన్ ఒక సుస్థిర దేశంగా మారుతోందని చెప్పారు. తమ దేశానికి సౌదీఅరేబియా రాజు సల్మాన్ వస్తున్న సమయంలో ఇలాంటి పనులు తాము ఎందుకు చేస్తామని ప్రశ్నించారు. దాడుల నెపంతో శాంతి చర్చలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఇమ్రాన్ ఈ మేరకు ఓ వీడియో ప్రకటన చేశారు.

యుద్ధం చేయాలని తాము ఎన్నడూ కోరుకోమని...కానీ, యుద్ధమే వస్తే ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని ఇమ్రాన్ అన్నారు. యుద్ధాన్ని ప్రారంభించడం మాత్రమే మానవుడి చేతిలో ఉందని... ఆ తర్వాత ఏం జరుగుతుందనేది కేవలం దేవుడికి మాత్రమే తెలుసని చెప్పారు. భారత ఉప ఖండంలో సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్ ఇంకా గతంలోనే జీవించాలని అనుకుంటోందా? అని ప్రశ్నించారు. దాడికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఆధారాలు ఉంటే సమర్పించాలని... విచారణ చేపట్టి, కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారత్ కు వెళ్లి ఉగ్రదాడులు చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. చర్చల ద్వారా మాత్రమే ఇరు దేశాల మధ్య సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.

తమ గడ్డపై ఉన్న ఏ వ్యక్తి కూడా హింసను కోరుకోడని ఇమ్రాన్ అన్నారు. పాక్ గడ్డపై ఉండి హింసకు పాల్పడేవారిని తాము ఉపేక్షించమని చెప్పారు. సరైన ఆధారాలు లేకుండానే పాకిస్థాన్ ను విమర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. భారత్ లో ఎన్నికల నేపథ్యంలోనే పాకిస్థాన్ పై దాడికి దిగుతున్నారని విమర్శించారు. సౌదీ రాజు పర్యటన నేపథ్యంలోనే పుల్వామా ఘటనపై తాను ఇంతవరకు స్పందించలేదని... ఇప్పుడు స్పందిస్తున్నానని చెప్పారు. సౌదీ రాజు పర్యటన లేకపోయినా... ఇలాంటి దాడులకు తాము పాల్పడమని, వీటి వల్ల పాకిస్థాన్ కు వచ్చేది ఏమీ లేదని అన్నారు. ఉగ్రవాదంపై చర్చకు తాము సిద్ధమని తెలిపారు. 

More Telugu News