Srinivas Goud: మంత్రిగా శ్రీనివాస్ గౌడ్: నాటి మునిసిపల్ కమిషనర్ కే నేడు పురపాలక బాధ్యతలు!

  • తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్
  • గతంలో మునిసిపల్ కమిషనర్ గా విధులు
  • ఆపై రాజీనామా చేసి, రాజకీయాల్లోకి

నేడు జరగనున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో శ్రీనివాస్ గౌడ్ తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఆయన్ను మునిసిపల్, ఎక్సైజ్ శాఖల మంత్రిగా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మునిసిపల్ ఉద్యోగిగా, పలు పురపాలక సంఘాల కమిషనర్ గా, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వర్తించిన ఆయన్ను ఇప్పుడు అదే పురపాలక మంత్రిత్వ శాఖ వరించింది. కేసీఆర్ ను నమ్ముకుని ఉన్నందుకు శ్రీనివాస్ గౌడ్ కు మంచి కానుక లభించిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

 తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, టి జెఏసి కో చైర్మన్ గా గతంలో పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ అంతకుముందు మల్కాజ్ గిరి మునిసిపల్ కమిషనర్ గానూ విధులు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషిస్తూ, కేసీఆర్ కు దగ్గరయ్యారు. కేసీఆర్ సూచన మేరకు తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వచ్చి, తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆపై ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచిన ఆయన మరికాసేపట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

More Telugu News