Cricket: భారత్-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ పై నీలినీడలు!

  • పుల్వామా ఎఫెక్ట్
  • మ్యాచ్ వద్దంటూ అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు
  • ఆందోళనలో పాక్ క్రికెట్ బోర్డు

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరిగినా చిన్నసైజు యుద్ధాన్ని తలపిస్తుంది. ఆటగాళ్లు కొదమసింహాల్లా తలపడడం, ఒక్కోసారి ఆవేశం ప్రదర్శిస్తూ మైదానంలో మాటల తూటాలు పేల్చుకోవడం కూడా కనిపిస్తుంది. ఇక వరల్డ్ కప్ అంటే చెప్పేదేముంది! ఏ మ్యాచ్ కైనా స్టేడియం నిండకపోవచ్చేమో కానీ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే గ్యాలరీలు క్రిక్కిరిసిపోవాల్సిందే. భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే పూర్తిస్థాయిలో వినోదానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. అలాంటిది ఈసారి వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ను తాము చూడాలనుకోవడంలేదని క్రికెట్ అభిమానులే కరాఖండీగా చెబుతున్నారు.

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందన్నది బహిరంగ రహస్యమే. దాని ఫలితమే పాకిస్థాన్ క్రికెట్ లీగ్ ప్రసారాలను భారత్ లో ఆపేశారు. ఇప్పుడు ఓల్డ్ ట్రాఫర్డ్ లో పాకిస్థాన్ తో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ ను బహిష్కరించాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ... వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉందని, ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నారు.

ఇప్పటికే పాకిస్థాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను భారత్ తెంచుకుంది. ఏదైనా టోర్నమెంట్లలో మాత్రమే పాకిస్థాన్ తో భారత్ క్రికెట్ మ్యాచ్ లు ఆడుతోంది. పుల్వామా దాడి నేపథ్యంలో ఇక ఎక్కడైనా గానీ పాకిస్థాన్ తో మ్యాచ్ లను బహిష్కరించాలని అన్ని వైపుల నుంచి బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది. బీసీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే తమ నిర్ణయం అంటోంది. 

More Telugu News