West Bengal: విస్తుపోయే వాస్తవం... కన్న కూతురినే కిడ్నాప్ చేయించిన బీజేపీ నేత!

  • తుపాకులతో బెదిరించి కుమార్తెను కిడ్నాప్ చేయించిన సుప్రభాత్ బత్యాబాల్
  • కుటుంబ సమస్యలు, రాజకీయంగా పాప్యులర్ కావడానికి కిడ్నాప్ డ్రామా
  • కేసును ఛేదించి, యువతిని రక్షించిన బెంగాల్ పోలీసులు

ఆదివారం నాడు తుపాకులతో బెదిరించి, పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ బీజేపీ నాయకుడి కుమార్తె కిడ్నాప్ కావడం కలకలం రేపగా, పోలీసులు ఈ కేసును 24 గంటల వ్యవధిలోనే ఛేదించి, విస్తుపోయే నిజాన్ని వెల్లడించారు. కిడ్నాప్ కు అసలు కారణం, ఆ అమ్మాయి కన్న తండ్రి, స్థానిక బీజేపీ నేత సుప్రభాత్ బత్యాబ్యాల్ అని, అతనితో పాటు కిడ్నాప్ కు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని బీర్భూమ్ ఎస్పీ శ్యామ్ సింగ్ తెలిపారు.

కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను మీడియాకు తెలిపిన ఆయన, ఆ యువతిని ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలో గుర్తించి కాపాడామని అన్నారు. ఆదివారం ఉదయం డాల్ ఖోలా రైల్వే స్టేషన్ సమీపంలో 22 సంవత్సరాల సుప్రభాత్ కుమార్తెను తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేశారు. ప్రాథమిక విచారణలోనే పోలీసులకు సుప్రభాత్ మీదే అనుమానం వచ్చింది. ఆపై పోలీసు బృందాలు చకచకా కదిలాయి.

ఈ ఉదయం ఆమెను రక్షించామని, కుటుంబ సమస్యలతో పాటు, రాజకీయంగా పాప్యులర్ కావాలన్న కోరికతో సుప్రభాత్ ఈ కిడ్నాప్ కు ప్లాన్ చేశాడని భావిస్తున్నామని వెల్లడించారు. ఐదు నెలల క్రితం వరకూ తృణమూల్ నేతగా ఉన్న ఆయన, ఆపై బీజేపీలో చేరారని తెలిపారు. ప్రస్తుతం మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు యువతిని ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఈ కిడ్నాప్ వార్త బయటకు వచ్చిన తరువాత టీఎంసీ నేత, ఎమ్మెల్యే మణిరుల్ ఇస్లామ్ ఇంటిపై దాడి జరిగిందని, దీని వెనుక కూడా సుప్రభాత్ హస్తం ఉండివుండవచ్చని అనుమానిస్తున్నామని, కేసును లోతుగా విచారిస్తున్నామని శ్యామ్ సింగ్ తెలిపారు.

More Telugu News