Chigurupati Jayaram: జయరాం హత్య కేసులో మరో విస్తుపోయే నిజం వెల్లడి.. దాడికి ముందు పక్కా ప్లాన్.. వీడియో చిత్రీకరణ

  • జయరాంతో ఖాళీ దస్తావేజులపై సంతకాలు
  • వాటిని చూపించి జయరాం ఆస్తిని కాజేయాలని ప్లాన్
  • సాక్ష్యం బలంగా ఉండడం కోసం వీడియో చిత్రీకరణ
ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో రోజుకో విషయం బయటకొస్తూ సంచలనమవుతోంది. ఇప్పటికే పలు మలుపులు తిరిగిన ఈ కేసులో తాజాగా మరో విషయం దర్యాప్తులో వెలుగుచూసింది. జయరాంను పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారనేది బయటపడింది. హత్యకు ప్రణాళిక వేసుకున్న నిందితుడు రాకేశ్ రెడ్డి అంతకంటే ముందే ఓ వీడియోను చిత్రీకరించినట్టు పోలీసులు నిర్ధారించారు. ఖాళీ దస్తావేజులపై జయరాంతో సంతకాలు చేయించుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

దస్తావేజులను అడ్డం పెట్టుకుని జయరాం ఆస్తిని దోచుకోవడం కోసమే నిందితుడు ఈ వ్యూహం పన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. జయరాం తన ఆస్తులను గతంలోనే తనకు స్వాధీనం చేశాడని చెప్పేందుకు వీలుగా దస్తావేజులతో పాటు మరో బలమైన సాక్ష్యం కోసం వీడియోను చిత్రీకరించినట్టు పోలీసులు అంచనాకొచ్చారు.

ఈ సాక్ష్యాల ఆధారంగా జయరాం కుటుంబ సభ్యులను బెదిరించడం, న్యాయపరమైన వివాదాలు సృష్టించడమే రాకేశ్ ఉద్దేశమని దర్యాప్తు అధికారులు తెలిపారు. వీడియో తీస్తున్నప్పుడు ఇతర నిందితులైన ఎస్సార్ నగర్‌కు చెందిన నగేశ్, విశాల్ అక్కడే ఉన్నారని, అయితే, పరిస్థితి అదుపు తప్పుతున్నట్టు గ్రహించి నగేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు.  
Chigurupati Jayaram
NRI
Vijayawada
Hyderabad
Rakesh Reddy
Murder

More Telugu News