Andhra Pradesh: చంద్రబాబు చేసిన బీసీ డిక్లరేషన్ కు దిక్కులేదు: వైఎస్ జగన్

  • గతంలో చంద్రబాబు బీసీలకు 119 వాగ్దానాలిచ్చారు
  • ఆ హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు
  • చంద్రబాబు మళ్లీ ‘బీసీ డిక్లరేషన్’ అంటున్నారు

2014లో చంద్రబాబు చేసిన బీసీ డిక్లరేషన్ కు ఇప్పటికీ దిక్కులేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఏలూరులో జరగుతున్న ‘బీసీ గర్జన’ సభలో ఆయన మాట్లాడుతూ, 2014 ఎన్నికలకు ముందు బీసీలకు చంద్రబాబు 119 వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ప్రతి ఏడాది పది వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్, బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి దాని అమలుకు చట్టం చేస్తామని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యావిధానాల్లో మార్పులు తెస్తామని, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు 33 శాతం పెంచుతామని.. ఇలా బీసీలకు ఇచ్చిన పలు హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు.

వైఎస్ హయాంలో వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ ను చంద్రబాబు నీరుగార్చారని, ముష్టివేసినట్టుగా రూ.30 వేలు రీయింబర్స్ మెంట్ కింద ఇస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో, విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబు, త్వరలో ఎన్నికలు రానుండంటతో మళ్లీ బీసీ డిక్లరేషన్ అని అంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి కులాన్ని మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని వాటిపై హామీ లిచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News