Eluru: బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదు.. మన జాతి వెన్నెముక కులాలు: వైఎస్ జగన్

  • భారతీయ సంస్కృతిని నిలబెట్టిన మహనీయులు వీరు
  • మన నాగరికతలో బీసీలకు ప్రత్యేక స్థానం ఉంది
  • నా పాదయాత్ర ద్వారా బీసీల సమస్యలు తెలుసుకున్నా

బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదని, మన జాతి వెన్నెముక కులాలు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైసీపీ నిర్వహిస్తున్న ‘బీసీ గర్జన’ సభలో ఆయన మాట్లాడుతూ, మీ అందరి ఆప్యాయత చూస్తుంటే ఈరోజే కురుక్షేత్రం చివరి రోజు అన్నట్టుగా ఉందని, బీసీల స్థితిగతులపై ఓ కమిటీ వేశామని, రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్లు పర్యటించి బీసీల స్థితిగతులు తెలుసుకున్నారని, తన పాదయాత్ర ద్వారా బీసీల సమస్యలు స్వయంగా తెలుసుకున్నానని అన్నారు.

భారతీయ సంస్కృతిని నిలబెట్టిన మహనీయులని కొనియాడారు. భారతీయ నాగరికతలో బీసీలకు ప్రత్యేక స్థానం ఉందని, ధరించే దుస్తుల నుంచి తినే ఆహారం వరకు, ఉపయోగించే పనిముట్టు, కట్టుకునే ఇల్లు..ఇలా ప్రతి ఒక్కటి నేర్పిన బీసీలకు రుణపడి ఉన్నామని అన్నారు. మన నాగరికతను కాపాడిన వ్యక్తులు బీసీలేనని, అటువంటి బీసీల బతుకుల్లో మార్పు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని జగన్ అన్నారు. 

More Telugu News