Andhra Pradesh: పెళ్లయిన రెండు నెలలకే.. వివాహిత అనుమానాస్పద మృతి!

  • ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘటన
  • ఘటన అనంతరం భర్త పరారీ
  • కేసు నమోదుచేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహమై రెండు నెలలు కూడా కాకముందే ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చిత్తూరు జిల్లాలోని గుడుపల్లె జిల్లా పరిషత్ స్కూలులో చంద్రజ్యోతి(29) టీచర్ గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం శ్రీకాళహస్తికి చెందిన బ్యాంకు ఉద్యోగి శరత్ కు జ్యోతిని ఇచ్చి వివాహం చేశారు. ఈ జంట స్థానిక హెచ్‌పీ రోడ్డులోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు.

అయితే పెళ్లయిన కొద్దిరోజులకే దంపతుల మధ్య వాగ్వాదం, గొడవలు జరిగాయి. దీంతో శనివారం ఉదయం చంద్రజ్యోతి అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఫ్యానుకు చున్నీతో నిర్జీవంగా వేలాడుతుండటాన్ని గమనించిన భర్త పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన అధికారులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

కాగా, శరత్ తమ కుమార్తెను వేధించేవాడని చంద్రజ్యోతి తల్లిదండ్రులు ఆరోపించారు. శుక్రవారం రాత్రి కూడా ఫోన్ చేసి ‘మీ కూతురిని తీసుకెళ్లిపోండి. నాకు అవసరం లేదు’ అని చెప్పాడన్నారు. శరతే చంద్రజ్యోతిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. కాగా, ప్రస్తుతం పరారీలో ఉన్న శరత్ కోసం గాలింపు ప్రారంభించినట్లు చిత్తూరు పోలీసులు తెలిపారు.
Andhra Pradesh
groom dead
murder
suspected
Chittoor District

More Telugu News