Khammam District: ఖమ్మమే కావాలి... రేవంత్, మధుయాష్కి, విజయశాంతి, వీహెచ్, రేణుకల డిమాండ్!

  • ఖమ్మం పరిధిలో 6 అసెంబ్లీలు గెలిచిన కాంగ్రెస్
  • టీఆర్ఎస్ చతికిలపడిన ఏకైక నియోజకవర్గం ఖమ్మం
  • ఖమ్మం నుంచి పోటీచేస్తే గెలుపు ఖాయమని భావిస్తున్న నేతలు

మరో మూడు నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ సీటు ఇప్పుడు హాట్ టాపిక్. తెలంగాణ కాంగ్రెస్ లోని సీనియర్ నేతలంతా ఈ సీటుపైనే కన్నేశారు. ఖమ్మం మాజీ లోక్ సభ సభ్యురాలు రేణుకా చౌదరి సహా, సీనియర్ నేత వీహెచ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, గత ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సహా దాదాపు 11 మంది నేతలు ఈ సీటు కావాలని అధిష్ఠానం వద్ద లాబీయింగ్ కు దిగారని తెలుస్తోంది.

గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరింటిలో కాంగ్రెస్ విజయం సాధించింది. రాష్ట్రం మొత్తంలో టీఆర్ఎస్ కు నామమాత్రపు మద్దతు పలికిన ఏకైక జిల్లా ఖమ్మం మాత్రమే. రాష్ట్రమంతా విజయవిహారం చేసిన టీఆర్ఎస్ ఒక్క ఖమ్మం విషయంలో మాత్రం చతికిలపడింది. దీంతో ఖమ్మం ఎంపీగా బరిలోకి దిగితే గెలుపు సునాయాసం అవుతుందన్నది కాంగ్రెస్ నాయకుల ఆలోచన. అందుకే ఈ సీట్ కు పోటీ విపరీతంగా పెరిగింది.

వీహెచ్, రేవంత్ రెడ్డి, మధుయాష్కి తదితరులు ఖమ్మం నుంచి పోటీ చేస్తామంటూ ఇటీవల అధిష్ఠానానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఖమ్మంలో టీడీపీ క్యాడర్ బలంగా ఉందని, తనకు సీటిస్తే, గెలుపు ఖాయమని రేవంత్ రెడ్డి ఘంటాపథంగా చెబుతున్నారు. ఖమ్మం ప్రాంతంలో తనకు అభిమానగణం చాలా అధికమని చెబుతున్న విజయశాంతి సైతం ఇదే మేలైన సీటని, గెలిచి చూపిస్తానని చెబుతున్న పరిస్థితి.

తాజా రాజకీయ పరిణామాలపై ఆ ప్రాంత నేత కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రేణుకా చౌదరి చాలా సీరియస్ గా ఉన్నారు. తన ఇలాకాలోకి వచ్చి, బయటి నేతల పెత్తనం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. తనను పక్కనబెడితే, రాజీనామాకైనా వెనుకాడబోనని హెచ్చరిస్తున్నారు.

More Telugu News