Kerala: మైనర్‌పై ఫాదర్ అత్యాచారం.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన కోర్టు

  • 2017లో కేరళలో ఘటన
  • ఫాదర్ రాబిన్‌ను దోషిగా తేల్చిన కోర్టు
  • ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించిన న్యాయస్థానం 

బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన కేరళ చర్చి ఫాదర్ రాబిన్ వడక్కన్‌చెరిల్‌కు కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 7, 2017న చైల్డ్‌లైన్ నంబరుకు ఓ ఫోన్ వచ్చింది. కూటుపరంబలోని క్రీస్తు రాజ్ ఆసుపత్రిలో ఓ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చిందనేది ఆ ఫోన్ కాల్ సారాంశం.

సెయింట్ సెబాస్టియన్ చర్చి ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ చర్చికి అప్పట్లో ఫాదర్ రాబిన్ వికార్‌గా ఉండేవారు. పోలీసుల దర్యాప్తులో బాలిక గర్భవతి కావడానికి కారణం ఆయనేనని తేల్చి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత రాబిన్ అదృశ్యమయ్యారు. అయితే, వలపన్నిన పోలీసులు రాబిన్ కెనడా పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అదే ఏడాది ఫిబ్రవరి 28న పట్టుకున్నారు.

తాజాగా ఈ కేసులో ఫాదర్ రాబిన్‌ను దోషిగా నిర్ధారిస్తూ 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఆరుగురిని సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటించింది. కాగా, పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో శిక్ష పడిన తొలి కేసు ఇదేనని చెబుతున్నారు.

More Telugu News