India: భారత జెండాను ప్రదర్శించిన పాక్ స్కూలు... కఠిన నిర్ణయం తీసుకున్న అధికారులు!

  • కరాచీలో బేబీకేర్ కేంబ్రిడ్జ్ స్కూల్
  • భారత పాటకు చిన్నారుల నృత్యం
  • రిజిస్ట్రేషన్ రద్దు చేసిన అధికారులు

ఓ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా భారత జెండాను ప్రదర్శించినందుకు పాకిస్థాన్ లోని పాఠశాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. కరాచీ నగరంలోని మామా బేబీకేర్‌ కేంబ్రిడ్జ్‌ స్కూల్‌ లో ఇటీవల ఓ ఈవెంట్ జరిగింది. ఇందులో కొందరు చిన్నారులు, మూడు రంగుల పతాకాన్ని రెపరెపలాడిస్తూ భారతీయ పాటకు నృత్యం చేశారు.

ఈ కార్యక్రమం వీడియో వైరల్ కావడంతో, సింధ్‌ ప్రైవేట్‌ సంస్థల రిజిస్ట్రేషన్‌, తనిఖీల డైరెక్టరేట్‌ అధికారులు సీరియస్ అయ్యారు. ఈ పాఠశాల ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలిందంటూ,  స్కూల్‌ రిజిస్ట్రేషన్‌ ను రద్దు చేశారు. విద్యాసంస్థల్లో ఇండియా సంస్కృతికి ప్రచారం చేయడం పాక్‌ జాతీయ గౌరవానికి విరుద్ధమని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

ఘటనపై స్కూల్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ స్పందిస్తూ, ఇతర దేశాల సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కోసమే ఇలా చేశామని, ఇండియాతో పాటు సౌదీ అరేబియా, అమెరికా, ఈజిప్టు, తదితర దేశాల సంప్రదాయాలపైనా ప్రదర్శనలు చేశామని అన్నారు.

More Telugu News