revenge attack: ప్రతీకార దాడికి భారత్ రెడీ.. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న కేంద్రం!

  • ఈరోజు ఉదయం 11.30 గంటలకు భేటీ
  • హాజరు కానున్న కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం
  • భవిష్యత్ కార్యాచరణను వివరించనున్న కేంద్రం

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై పాక్ ప్రేరేపిత జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో తొలుత 43 మంది జవాన్లు దుర్మరణం చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ మొత్తం 40 మంది జవాన్లు అమరులయ్యారని అధికారులు తేల్చారు. ఈ దుర్ఘటనపై దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ లో ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగకుండా పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈరోజు అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. దీనికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు హాజరవుతున్నాయి.

పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు వీలుగా అభిప్రాయ సేకరణకు హోంశాఖ సిద్ధమైంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఈరోజు ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఏం చర్యలు తీసుకోవాలన్న విషయమై రాజకీయ పక్షాల నుంచి సలహాలు, సూచనలను కేంద్రం స్వీకరించనుంది. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలను హోంమంత్రి రాజ్ నాథ్ ఈ సందర్భంగా నేతలకు వివరించనున్నారు. తమ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వనున్నారు. మరోవైపు భారత్ పాక్ సరిహద్దులో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి 150 యుద్ధ విమానాలను వాయుసేన సిద్ధంగా ఉంచింది.

More Telugu News