afghanistan: ఆ ఊరినిండా ఎక్కడ చూసినా మిసైళ్లే.. ఆఫ్గాన్ లో పెను ప్రమాదం అంచున కుగ్రామం!

  • ఇళ్లు, వంతెనలన్నీ మిస్సైళ్ల ఆధారంగా నిర్మాణం
  • ఎప్పుడైనా పేలవచ్చంటున్న నిపుణులు
  • నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్న అధికారులు

ఆఫ్గానిస్తాన్ లోని కెజెలాబాద్ గ్రామం కాస్త డిఫరెంట్. ఎందుకంటే, ఈ ఊర్లో ప్రతీ ఇంట్లో కనీసం అరడజను క్షిపణులు (మిస్సైళ్లు) కనిపిస్తాయి. ఇంటి దూలాలుగా, కాలువను దాటేందుకు బ్రిడ్జీలుగా వీటిని వినియోగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిపుణులు రంగంలోకి దిగారు. అవి ఎంత ప్రమాదకరమో వివరించడంతో పాటు వాటిని తొలగించే ప్రక్రియను ప్రారంభించారు.

ఈ విషయమై డానిష్ డీ-మైనింగ్ గ్రూప్‌నకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ అనే నిపుణుడు మాట్లాడుతూ.. ఈ ఊరంతా 400 మిస్సైళ్లతో నిండి ఉందని తెలిపారు. 1980ల్లో యుద్ధం ముగిసిన తర్వాత సోవియట్ యూనియన్ వీటిని ఇక్కడే వదిలేసి వెళ్లిపోయిందని వెల్లడించారు. అయితే ఈ క్షిపణులు ప్రమాదకరం అని తెలియని గ్రామస్తులు వాటిని యథేచ్ఛగా ఇళ్లు, చిన్న వంతెనల నిర్మాణంలో వాడేశారు. చివరికి డీ-మైనింగ్ టీమ్ గ్రామానికి చేరుకుని వాటిని గుర్తించేవరకూ ఇవి ఎంత ప్రమాదకరమో గ్రామస్తులకు తెలియలేదు.

వీటి తీవ్రతను డీమైనింగ్ టీమ్ గ్రామంలోని మహిళలకు వివరించింది. దీంతో మహిళలు స్పందిస్తూ..‘ఈ క్షిపణులు మా వంట గదుల పక్కనే ఉన్నాయి. వీటిని వెంటనే తీసేయండి’ అని అధికారులను కోరుతున్నారు. అయితే వీటిని తొలగించడం అంత సులభం కాదని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే క్షిపణులను తొలగించేటప్పుడు ఏమాత్రం ఒత్తిడి, రాపిడికి గురైనా అవి ఒక్కసారిగా పేలిపోతాయని హెచ్చరిస్తున్నారు. వీటన్నింటిని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేయాల్సి ఉంటుందన్నారు.

More Telugu News