masood azhar: పుల్వామా ఘటనను ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్నా.. తీరు మార్చుకోని చైనా

  • పుల్వామా ఘటనతో షాక్ కు గురయ్యామన్న చైనా
  • మృతుల కుటుంబాలకు సంతాపం
  • మసూద్ అజార్ విషయంలో మాత్రం పాత పల్లవే అందుకున్న డ్రాగన్

జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచదేశాలన్నీ ఖండిస్తున్నా... చైనా మాత్రం కుక్క తోక వంకర అన్నట్టుగానే వ్యవహరిస్తోంది. ఈ దాడిని తామే చేశామని జైషే మొహమ్మద్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయినా, ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించలేమని చైనా మరోసారి ప్రకటించింది.

పుల్వామా ఘటనతో షాక్ కు గురయ్యామని చైనా తెలిపింది. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించింది. అయితే, మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నిర్ణయానికి మాత్రం మద్దతు ప్రకటించలేదు. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ మాట్లాడుతూ, టెర్రరిస్టు సంస్థలను నిషేధించే ప్రక్రియకు సంబంధించి భద్రతామండలిలో 1267 మందితో కూడిన కమిటీలో ఏకాభిప్రాయం లేదని తెలిపారు.

 భద్రతామండలి ఆంక్షలు విధించిన జాబితాలో జైషే మొహమ్మద్ కూడా ఉందని... ఆ సంస్థపై ఆంక్షలను విధించే విషయంలో నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని చెప్పారు. మసూద్ ను అంతర్జాతీయ టెర్రరిస్టుల జాబితాలో చేర్చేందుకు ఇండియాతో పాటు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లోని ఇతర సభ్యులంతా ప్రయత్నిస్తున్నప్పటికీ... చైనా మరోసారి పాత పల్లవినే అందుకోవడం, భారత్ పట్ల ఆ దేశానికి ఉన్న వైఖరిని తేటతెల్లం చేస్తోంది.

More Telugu News