Andhra Pradesh: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 20-30 మంది టీడీపీ నేతలకు టికెట్లు దక్కవు!: బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు

  • వాళ్లే ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు
  • పదవుల కోసమే అవంతి, ఆమంచి వైసీపీ తీర్థం
  • కులం ప్రస్తావన తీసుకురావడంపై మండిపాటు
అనకాపల్లి లోక్ సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పదవులు ఆశించే వైసీపీలో చేరారని ఏపీ ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. టీడీపీలో చేరేందుకు 18 నెలల పాటు పార్టీ చుట్టూ తిరిగిన ఆమంచి.. ఇప్పుడేమో వైసీపీలో చేరారని విమర్శించారు. నాయకులు పార్టీలు మారినప్పుడు కులాల ప్రస్తావన మంచిది కాదని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడారు.

తొలుత ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్, ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం అయ్యారనీ, చివరికి టీడీపీలో చేరి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆఖరి నిమిషంలో వైసీపీలో చేరారని దుయ్యబట్టారు. ఇప్పుడు వైసీపీలోకి వెళుతూ కులం పేరు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీలో 20-30 మందికి టికెట్లు దక్కవనీ, వారే ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారని స్పష్టం చేశారు.
Andhra Pradesh
assembly
20-30 no seats
budha venkanna
Telugudesam
amanchi
avanti

More Telugu News