పుల్వామా ఉగ్రదాడి.. 12 కిలోమీటర్ల దూరం వినిపించిన పేలుడు శబ్దం!
- భారీ శబ్దంతో పేలిపోయిన సైనికుల బస్సు
- ఆనవాళ్లు లేకుండా పోయిన ఉగ్రవాది ఉపయోగించిన కారు
- 2001 తర్వాత దేశంలోనే అతిపెద్ద ఆత్మాహుతి దాడి
పుల్వామా దాడిని దేశంలోనే అతిపెద్ద ఆత్మాహుతి దాడిగా చెబుతున్నారు. 2001లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు ఆత్మాహుతి సభ్యులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. కాగా, ఘటన జరిగిన ప్రాంతంలో పేలుడుకు ఉపయోగించిన కారు ఆనవాళ్లు కూడా లేకుండా తునాతునకలైపోవడం గమనార్హం. పేలుడు శబ్దం విని సమీపంలోని లెథోపొరా మార్కెట్‌లోని వ్యాపారులు దుకాణాలు బంద్ చేసి పరుగులు తీశారు.