Terrorists: డెడ్లీ అటాక్ కు 9వ తేదీనే ప్లాన్... వాతావరణం అనుకూలించక వాయిదా!

  • ఫిబ్రవరి 9న అఫ్జల్ గురును ఉరితీసిన రోజు
  • ఇండియాను ఏడిపించాలన్న మౌలానా మసూద్
  • స్థానికులే సమాచారం ఇచ్చి ఉంటారని అనుమానం

ఫిబ్రవరి 9... భారత పార్లమెంట్ పై ఉగ్రదాడికి తెగబడి, ఆపై పోలీసులకు చిక్కి ఉరిశిక్షను అనుభవించిన అఫ్జల్ గురు వర్ధంతి. అఫ్జల్ గురు వర్ధంతి రోజున భారత సైన్యంపై భారీ ఎత్తున దాడి చేయాలని ప్లాన్ వేసిన ఉగ్రవాదులు, దాన్ని ఆరు రోజులు వాయిదా వేసుకుని 15వ తేదీన పుల్వామాలో తెగబడ్డారు.

9వ తేదీన జమ్మూ కాశ్మీర్ లో మంచు దట్టంగా కురుస్తూ ఉండటం, ఆర్మీ వాహనాల సంచారం లేకపోవడంతోనే ఉగ్రవాదులు దాడిని వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. ఉగ్రవాదుల మధ్య జరిగిన సంభాషణల్లో "బడా హోనా చాహియే... హిందుస్తాన్ రోనా చాహియే" (అది చాలా పెద్దగా ఉండాలి. ఇండియా ఏడవాలి) అన్న మాటలు ఉన్నాయని, ఇవి మౌలానా మసూద్ అజర్, దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఘాజీకి మధ్య జరిగాయని నిఘా వర్గాలు వెల్లడించాయి.

వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ లో 1000 మందికి పైగా జవాన్ల కాన్వాయ్ ప్రయాణించేందుకు వీల్లేదు. అయితే, చాలా మంది సెలవులను ముగించుకుని రావడం, వాతావరణం అనుకూలంగా ఉండటంతోనే 2,500 మంది జవాన్లతో కూడిన కాన్వాయ్ జమ్మూ నుంచి సరిహద్దులవైపునకు కదిలింది. ఇక ఇంత భారీ కాన్వాయ్ బయలుదేరిందన్న విషయాన్ని స్థానికులే ఎవరో ఉగ్రవాదులకు చేరవేసివుంటారన్న అనుమానాలు ఉన్నాయి. కాన్వాయ్ నెమ్మదిగా వెళుతుండటంతో నష్టం అధికంగా ఉందని అధికారులు అంటున్నారు.

More Telugu News