YSRCP: ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో జగన్ ఉన్నారు.. చంద్రబాబును ప్రజలు నమ్మరు: అవంతి శ్రీనివాస్

  • మొదటి నుంచి వైఎస్ జగన్ ఒకే మాటపై ఉన్నారు
  • ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నా 
  •  ఎంత చెప్పినా చంద్రబాబు మా మాట వినలేదు 

టీడీపీకి, తన ఎంపీ పదవికి తాను రాజీనామా చేశానని, తాను రాజీనామా చేసిన తర్వాతే వైసీపీ అధినేత జగన్ ని కలిశానని తాజాగా వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ లో, లోటస్ పాండ్ లోని నివాసంలో వైఎస్ జగన్ ని ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, మొదటి నుంచి వైఎస్ జగన్ ఒకే మాటపై ఉన్నారని, ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో జగన్ ఉన్నారని అన్నారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై ఆయన విమర్శలు గుప్పించారు. బాబు తన రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని సూచించారు. అవకాశవాద రాజకీయాలను ప్రజలను గమనిస్తున్నారని, చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని  విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసినా ఏం సాధించలేకపోయామని, ఆనాడే వైసీపీ ఎంపీలతో పాటు తాము కూడా రాజీనామాలు చేసి ఉంటే ప్రయోజనం ఉండేదని అభిప్రాయపడ్డారు. నాడు చంద్రబాబుకు ఎంత చెప్పినా తమ మాటలు వినిపించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని, బాబు ఏం చెప్తే అది వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు.

More Telugu News