bihar: కూతురిని తీసుకుని పరీక్షా కేంద్రానికి వెళుతున్న వ్యక్తిపై బుల్లెట్ల వర్షం...గాయాలతోనే కేంద్రానికి చేర్చిన వైనం!

  • ఆ తర్వాత గ్రామస్థుల సాయంతో ఆసుపత్రికి
  • బాధితుడు మాజీ సర్పంచ్‌
  • పాతకక్షలతో దాడి అని అనుమానం

అతనో మాజీ గ్రామ సర్పంచ్‌. పాతకక్షలతో అతనిపై దాడిచేయాలని నిర్ణయించిన దుండగులు అదనుకోసం చూస్తున్నారు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలకు కుమార్తెను కేంద్రానికి తీసుకు వెళుతుండడాన్ని గమనించిన ఆగంతుకులు దారిలో అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అయినా వెరవని అతను గాయాలతోనే కేంద్రంలో కూతుర్ని దించి తర్వాత ఆసుపత్రికి వెళ్లాడు.

బాధితుడి ధైర్యసాహసాలు చూసి స్థానికులే ఆశ్చర్యపోయిన ఈ ఘటన బీహార్‌ రాష్ట్రంలోని బేగుసరాయ్‌ జిల్లాలో జరిగింది. రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీకి చెందిన రాంక్రిపాల్‌ మహతో మాజీ సర్పంచ్‌. పదో తరగతి చదువుతున్న అతని కుమార్తె బేగుసరాయిలో వార్షిక పరీక్షలు రాయాల్సిఉంది. కేంద్రంలో కుమార్తెను దింపేందుకు రాంక్రిపాల్‌ కారులో బయలుదేరాడు. బేగుసరాయికి కొద్దిసేపట్లో చేరుకుంటారనగా గుర్తు తెలియని ఆరుగురు సాయుధులైన వ్యక్తులు అతని కారుని చుట్టుముట్టి కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో కొన్ని బుల్లెట్లు రాంక్రిపాల్‌ శరీరంలోకి దూసుకుపోయాయి. శరీరం రక్తం ఓడుతున్నా భయపడని రాంక్రిపాల్‌ కుమార్తెను నేరుగా పరీక్షా కేంద్రంలో దించేశారు. అనంతరం స్థానికుల సహకారంతో బేగుసరాయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పాతకక్షలతోనే దుండగులు రాంక్రిపాల్‌పై దాడి చేశారని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు.

More Telugu News