Prime Minister: ఈ ఐదేళ్లలో భారత్ గొప్పతనం పెరిగింది: ప్రధాని మోదీ

  • ప్రజా ప్రయోజనాల కోసమే కఠిన నిర్ణయాలు తీసుకుంది
  • దేశ భవిష్యత్ దృష్ట్యా అవినీతిపై పోరాటం చేశాం
  • ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలన్నీ భారత్ ను ప్రశంసిస్తున్నాయి

ప్రజా ప్రయోజనాల కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, దేశ భవిష్యత్ దృష్ట్యానే అవినీతిపై పోరాటం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్ సభ సమావేశాల ముగింపు సందర్భంగా మోదీ ప్రసంగించారు. ఈ ఐదేళ్లలో ప్రపంచంలో భారత్ గొప్పతనం పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో భూతాపం తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టామని, ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలన్నీ భారత్ ను ప్రశంసిస్తున్నాయని అన్నారు. తమ పాలనలో బంగ్లాదేశ్ తో భూ సరిహద్దు వివాదం పరిష్కారమైందని గుర్తుచేశారు. ఉపగ్రహాల ప్రయోగాల్లో గొప్ప అభివృద్ధి సాధించామని, పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు.

నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా అనేక చట్టాలు చేసిన ఘనత తమదేనని, జీఎస్టీ బిల్లు తీసుకొచ్చి దేశ ఆర్థిక రంగ రూపు రేఖలు మార్చామని అన్నారు. తమ పాలనలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేశామని, గర్భిణులకు 26 వారాల పాటు సెలవులు ఇవ్వాలని చట్టం చేశామని గుర్తు చేశారు.

ఐక్యరాజ్యసమితిలో భారత దేశ గౌరవప్రతిష్టలు పెరిగాయని, ఐక్యరాజ్యసమితిలో మహాత్మాగాంధీ, అంబేద్కర్ జయంతులు నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. డిజిటల్ ప్రపంచంలో భారత్ స్థానం సుస్థిరమైందని, భవిష్యత్ లో మరిన్ని ఉద్ధృతమైన కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. లోక్ సభ స్పీకర్, రక్షణ మంత్రి సహా ఈ లోక్ సభలో 44 మంది మహిళా సభ్యులు ఉండటం గర్వకారణమని అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలను మోదీ గుర్తుచేస్తూ విమర్శలు గుప్పించారు. కొందరు భూకంపం తెప్పిస్తామన్నారు కానీ అదేమీ రాలేదని ఎద్దేవా చేశారు.

More Telugu News