rafale: రాఫెల్ పై పార్లమెంటుకు చేరిన కాగ్ నివేదిక.. సంచలన విషయాలు!

  • గత ఒప్పందం కంటే ప్రస్తుత ఒప్పందమే బెస్ట్
  • 2.8 శాతం తక్కువ ధరకు విమానాలు వస్తున్నాయి
  • గత ఒప్పందం కంటే 5 నెలల ముందే 18 విమానాలు రానున్నాయి

యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారిన రాఫెల్ యుద్ధ విమానాల డీల్ పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈ నివేదికలో సంచలన విషయాలను కాగ్ వెల్లడించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న డీల్ కంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందమే బెస్ట్ అంటూ కాగ్ తెలిపింది. 126 యుద్ద విమానాల కోసం గతంలో చేసుకున్న ఒప్పందం కంటే... ప్రస్తుత ప్రభుత్వం 36 విమానాల కోసం చేసుకున్న ఈ ఒప్పందం 2.8 శాతం చీప్ అని పేర్కొంది.

అయితే, వివాదానికి కేంద్ర బిందువైన యుద్ధ విమానాల ధరను మాత్రం నివేదికలో కాగ్ పేర్కొనలేదు. ధరలను బహిరంగపరచకూడదని రక్షణ శాఖ భావిస్తుండటమే దీనికి కారణం. రాఫెల్ యుద్ధ విమానాలలో 13 కీలకమైన మార్పులను భారత్ కోరిందని... ప్రస్తుత దేశ రక్షణ పారామితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని... యుద్ధ విమానాల ఆధునికీకరణకు అయిన ఖర్చు కొత్త ఒప్పందంతో చాలా తగ్గిందని కాగ్ తెలిపింది. గత ఒప్పందం కంటే 5 నెలల ముందే 18 విమానాలు భారత్ కు రానున్నాయని చెప్పింది.

మరోవైపు, కాగ్ రిపోర్ట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని విపక్షాలు మండిపడ్డాయి. ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహర్షీ అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారని... రాఫెల్ ఒప్పందంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని... కాగ్ నివేదికను ఆయన వెలువరించేందుకు వీల్లేదని నిరసన వ్యక్తం చేశాయి. కాగ్ నివేదిక నేపథ్యంలో, రాజ్యసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

More Telugu News