swetha reddy: వైజాగ్ లో నా గురించి ఎందుకలా మాట్లాడారు?: కేఏ పాల్ పై శ్వేతారెడ్డి ఫైర్

  • నేను అడ్రస్ లేకుండా పోయానని ఎలా ప్రకటిస్తారు?
  • హిందూపురం టికెట్ ను ఇతరులకు అమ్ముకోవాలనుకుంటున్నారా?
  • గడువు ముగియకుండానే నా సమర్థతను ఎలా లెక్కిస్తారు?
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై ఆ పార్టీ హిందూపురం అభ్యర్థి శ్వేతారెడ్డి మండిపడ్డారు. పార్టీ తరపున మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ప్రకటించారని.. ఆ తర్వాత ఇటీవల వైజాగ్ లో జరిగిన ఓ సభలో తాను అడ్రస్ లేకుండా పోయానని ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, ఈనెల 21వ తేదీ వరకు 10 వేల సభ్యత్వాలు చేయించాలని తనతో చెప్పారని... కానీ, 21వ తేదీ రాకముందే తన గురించి మాట్లాడటం దారుణమని అన్నారు. హిందూపురం టికెట్ ను ఎవరికైనా అమ్ముకోవడానికి ఈ ప్రకటన చేశారా? అని ప్రశ్నించారు.

ప్రజాశాంతి పార్టీకి సిద్ధాంతం కానీ, అజెండా కానీ లేవని శ్వేత అన్నారు. కేఏ పాల్ నోరు తెరిస్తే ఒబామా, ట్రంప్, మిలియన్స్, ట్రిలియన్స్ అంటూ మాట్లాడతారని... అమరావతికి కనీసం రూ. 10 కోట్లు కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. క్రిస్టియన్ సమాజాన్ని కించపరిచేలా పాల్ వ్యవహరిస్తున్నారని... వైసీపీ ఓట్లను చీల్చే విధంగా రాజకీయం చేస్తున్నట్టు తనకు అనిపిస్తోందని చెప్పారు.

వైజాగ్ లో తన గురించి మాట్లాడాల్సిన అవసరం పాల్ కు ఎందుకొచ్చిందని శ్వేత ప్రశ్నించారు. పార్టీ సమావేశాలను నిర్వహించేందుకు తమ వద్ద డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని అడిగారు. దేవుడి బిడ్డ అబద్ధాలు చెప్పరాదనే విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు. ఇచ్చిన గడువు ముగియకుండానే తన సమర్థతను ఎలా లెక్కిస్తారని మండిపడ్డారు.
swetha reddy
prajashanthi party
hindupuram
ka paul

More Telugu News