panchayati pols: తెలంగాణలో మరో మారు పంచాయతీ ఎన్నికల నగారా

  • ఎన్నికలు ఆగిపోయిన పంచాయతీల్లో 28న పోలింగ్‌
  • తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
  • ఈనెల 18న ఉపసర్పంచ్‌ పదవులకు ఎన్నిక

తెలంగాణలో మరోసారి పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికలను ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసింది. అదే సందర్భంలో ఆయా పంచాయతీల్లో వాయిదా పడిన ఉపసర్పంచ్‌ల ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి చేయాలని నిర్ణయించింది.

కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి ఈ ఏడాది జనవరి 21, 25, 30వ తేదీల్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్రంలోని ఏడు పంచాయతీల్లో పూర్తిగా ఎన్నికలు జరగలేదు. అలాగే, ఆరు పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవికి, వివిధ పంచాయతీల్లో 246 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగలేదు. 560 పంచాయతీల్లో ఉపసర్పంచ్‌ల ఎన్నిక పెండింగ్‌లో పడింది. పంచాయతీల్లో ఎన్నికల కోసం ఈనెల 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదేరోజున ఫలితాలు ప్రకటిస్తారు.

అలాగే పెండింగ్‌లో ఉన్న ఉపసర్పంచ్‌ పదవుల ఎన్నిక ఈనెల 18వ తేదీన పూర్తిచేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ) పంచాయతీ పాలకవర్గాలతో ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌ల ఎన్నికలు పూర్తి చేస్తారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా అందిన ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి సీనియర్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల వివరాలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదే నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ ఫిర్యాదులను ఆయా కోర్టులు విచారించి సమస్యలను పరిష్కరిస్తాయి.

  • Loading...

More Telugu News