Summer: రానున్నది వేసవి కాదు... నిప్పుల ఉప్పెన: హెచ్చరించిన వాతావరణ శాఖ

  • ఈ సంవత్సరం ఎండ మంటలే
  • 2016ను మించిన ఉష్ణోగ్రతలు నమోదు
  • హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ నిపుణులు

చలికాలం వెళ్లిపోతోంది. ఎండలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉంటుండగా, తెల్లవారుజామున మాత్రమే కాస్తంత చలి అనిపిస్తోంది. ఈ చలి కూడా మరో వారం పదిరోజుల్లో మాయమవుతుంది. ఆపై ఎండాకాలం మొదలు. మీకు 2016లో ఎండాకాలం గుర్తుందా? లాతూరు ప్రాంతంలో నీరు దొరకాలంటే పోరాటం చేయాల్సి వచ్చేది. దీనిపై స్పందించిన యావత్ భారతావని రైళ్లలో మంచి నీటిని ఆ ప్రాంతానికి పంపింది. ఈ సంవత్సరం అంతకు మించిన ఎండలు కాస్తాయట. లాతూర్ వంటి పరిస్థితి మరిన్ని ప్రాంతాల్లో కనిపిస్తుందట.

ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయేది మామూలు వేసవి కాలం కాదని, గత రికార్డులను అధిగమించే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని అభిప్రాయపడుతున్నారు. తేమ గాలులు వీచే అవకాశాలు లేకపోవడమే ఇందుకు కారణమని, అల్ప పీడనాలు లేక, మబ్బులు కనిపించక సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతుందని చెబుతున్నారు. దేశంలోని ఎన్నో ప్రాంతాలు 50 డిగ్రీలను మించిన వేడిమిని చూడనున్నాయని అంటున్నారు.

ఈ ఎండలపై తగు జాగ్రత్తలు తీసుకోకుంటే, ప్రాణ, పంట నష్టాలకు అవకాశం ఉంటుందని, ఎప్పటికప్పుడు వేడి తీవ్రత గురించి తెలుసుకున్న తరువాతనే బయటకు వస్తే మంచిదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి ఎండలు మండిపోనున్నాయని, చిన్న చిన్న రిజర్వాయర్లలో నీరు పూర్తిగా ఇంకిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తల్లో అత్యధికులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 2019 ఎండాకాలం గతంలో ఎన్నడూ చూడనంత ఉష్ణోగ్రతలను పరిచయం చేస్తుందని వ్యాఖ్యానించారు. 2016ను మించిన ఎండలు కాస్తాయని అభిప్రాయపడ్డారు. సూర్యకాంతికి ఎల్ నినోలు తోడు కానున్నాయని, వీటి ప్రభావం ప్రజలపై అధికమని ఆంధ్రా యూనివర్శిటీ వాతావరణ విభాగం ప్రొఫెసర్ రామకృష్ణ వెల్లడించారు. 

More Telugu News